బేషుగ్గా తమిళనాడు గవర్నర్‌ చర్యలు… అన్నాడీఎంకే ప్రశంస

తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవి వ్యవహారం పట్ల అధికార డీఎంకే ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూ, ఆయనను రాష్ట్రం నుండి బదిలీ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరగా, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే మాత్రం దివ్యంగా పనిచేస్తున్నారని అంటూ ప్రశంసలు కురిపిస్తున్నది. పైగా, రాష్ట్రంలో డీఎంకే పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి అంటూ గవర్నర్ ను కలసి  ఫిర్యాదు చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్‌ తీరు సరైనదేనని, డీఎంకే తప్పులను నిలదీయాల్సింది ఆయనేనని తేల్చి చెప్పారు. తన సహచరులైన మాజీ మంత్రులు తంగమణి, వేలుమణి, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాధన్‌, సీవీ షణ్ముగం, జయకుమార్‌, దిండుగల్‌ శ్రీనివాసన్‌ తదితరులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన గవర్నర్‌తో భేటీ అయ్యారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని, వరద బాధితులకు తగిన సాయం అందడం లేదని తదితర సమస్యలపె వినతిపత్రం అందించారు. అనంతరం బయటికొచ్చిన ఈపీఎస్‌ విలేఖరులతో మాట్లాడుతూ  రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. 

కోవైలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగి ఉంటే పలువురు ప్రాణాలు కోల్పోయేవారని, ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్‌ విభాగం విఫలమైందని ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు బానిసలవుతున్నారని, పొరుగు రాష్ట్రాల నుంచే యధేచ్చగా మాదకద్రవ్యాలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని ఆరోపించారు. 

అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. ‘నమ్మ ఊరు సూపర్‌’ అనే ప్రకటనలో భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు. గవర్నర్‌ను విమర్శించడం డీఎంకేకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ క్రీడల నిషేధ చట్టాన్ని ఆమోదించాలని గవర్నర్‌ కోరామని, ఈ విషయమై తగిన చర్యలు చేపడతామని గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు పళనిస్వామి తెలిపారు.