తెలంగాణ బీసీ జాబితాలో ఏపీకి చెందిన 26 కులాలను తిరిగి చేర్చాలి

తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చకపోతే కేసీఆర్ సర్కార్ పై మరో ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.  లక్ష్మణ్ హెచ్చరించారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఏపీ బీజేపీ నాయకులతో కలసి రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ డా.  తమిళసై సౌందరరాజన్ ను కలసిన లక్ష్మణ్ బృందం ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది.  ఏపీ, తెలంగాణలోని బీసీల సమస్యలను బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 బీసీ కులాలను  తిరిగి బీసీ జాబితాలో చేర్చేలా చూడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్  తమ విజ్ఞప్తికి గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఆంద్రా సెటిలర్స్ ను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్  మాట తప్పారని విమర్శించారు.
ఆంధ్రా వాళ్లకు ముల్లు కుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ కడుపు కొట్టిండని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా ఒక్క కలంపోటుతో 2 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని విమర్శించారు.  కేసీఆర్ చర్యతో స్కాలర్ షిప్ లు లేక బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయా కులాల పూర్వీకులకు ఆంధ్ర మూలాలు ఉండడమే నేరమా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్ చేయకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీ జాబితాలో చేర్చుతామని తెలిపారు. గవర్నర్ ను కలిసిన బృందంలో ఏపీ  బీజేపీ ప్రధాన కార్యదర్శి,  ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా ఉన్నారు.