మల్లారెడ్డి ఐటీ దాడుల్లో క్యాసినో పెట్టుబడులపై ఆరా!

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులలో కొత్త కోణం వెలుగుచూసింది. దానితో క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జై కిషన్ ఇంట్లో సోదాలు చేశారు. గతంలో చీకోటి ప్రవీణ్‌తో కలిసి క్యాసినో వ్యవహారాల్లో ఇతను కీలక పాత్ర పోషించాడు. మల్లారెడ్డి సీఎంఆర్ స్కూల్ పార్టనర్‌గా జైకిషన్ తండ్రి నర్సింహ యాదవ్ ఉన్నారు.
 
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ సెగ తగిలింది. ఐటీ అధికారులు మంగళవారం మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై మెరుపుదాడులు చేశారు. మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
 
ఏకంగా 50 బృందాలుగా విడిపోయి మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు ఈ తనిఖీల్లో వేర్వేరు చోట్ల దాదాపు రూ.4 కోట్ల నగదును, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
 
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దాడులు కొనసాగిస్తున్నారు. మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తన సతీమణితో కలిసి టర్కీలో విహారయాత్రలో ఉన్నారు. దీంతో ఐటీ అధికారులు వాచ్‌మన్‌ సహాయంతో తలుపులు తెరిపించి ఇంట్లోకి ప్రవేశించారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తన సతీమణితో కలిసి టర్కీలో విహారయాత్రలో ఉన్నారు. దీంతో ఐటీ అధికారులు వాచ్‌మన్‌ సహాయంతో తలుపులు తెరిపించి ఇంట్లోకి ప్రవేశించారు.  నివాసంలోని పై అంతస్తులో ఉన్న ఓ గదిలో పెద్దమొత్తంలో నగదుతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 

మల్లారెడ్డి విద్యా సంస్థల నగదు లావాదేవీలు బాలానగర్‌లో గల క్రాంతి బ్యాంక్ లో జరిగాయని ఐటీ అధికారుల వద్ద ఆధారాలు సేకరించారు. ఆ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును కూడా ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 
మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టారు. రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. అతను సుచిత్రలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో మరో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోనూ ఐటీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్ ను పక్కన ఉన్న క్వార్టర్స్ లో దాచినట్లు తెలవగా దానిని అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు.  అంతేకాదు మల్లారెడ్డి సోదరుని ఇంట్లో ఓ లాకర్ ను గుర్తించిన అధికారులు దానిని బయటి వ్యక్తి సహాయంతో పగలగొట్టారు. ఆ లాకర్ లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.