‘కాశీ తమిళ సంగమం’కు పెరుగుతున్న విద్యార్థులు

‘కాశీ తమిళ సమాగం’ కార్యక్రమంలో భాగంగా, మూడో రోజుయిన సోమవారం నాడు, పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీలోని వివిధ ఘాట్‌ల వద్దకు తమిళనాడు ప్రతినిధి బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో ఘాట్‌లలో పవిత్ర స్నానం చేసిన తర్వాత, బృందాలుగా బయలుదేరి కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించుకున్నారు. 

బనారసీ వంటకాలను ఆస్వాదించారు. వివిధ చేతివృత్తుల ఉత్పత్తులను పరిశీలిస్తూ, కొనుగోలు చేస్తూ గడిపారు. తమిళనాడు నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య వారణాసి రైల్వే స్టేషన్, విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో పెరుగుతోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం వారణాసి నగరంలోని చాలా హోటళ్లు, ‘ధర్మశాలలను’ ముందుగానే బుక్ చేశారు.

తమిళనాడులోని రామేశ్వరం విద్యార్థులు మొదటిసారి వారణాసిని సందర్శించిన సందర్భంగా ‘కాశీ తమిళ సమాగం’ వేదిక వద్ద ఉత్సాహంగా కనిపించారు. కాశీ తమిళ సంగమం రూపంలో సంస్కృతి, వారసత్వ ఏకం చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవను ప్రశంసించారు.
 
నెల రోజుల పాటు జరిగే ‘కాశీ తమిళ సంగమం’ ఉత్సవాలను ప్రధాని శనివారం ప్రారంభించారు. కాశీ-తమిళనాడు మధ్య పూర్వకాలం నుంచి ఉన్న సంబంధాన్ని తన ప్రారంభోపన్యాసంలో ప్రస్తావించిన ప్రధాన మంత్రి, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కల ఇప్పుడు వాస్తవ రూపు రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) యాంఫీ థియేటర్ మైదానంలో ప్రతిరోజూ నృత్యాలు, నాటకాలు, సంగీతం, పాటలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కాశీ స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని, తమిళనాడుకు చెందిన వివిధ వంటకాలను ఆస్వాదించడం కనిపించింది.

 
కాగా, తమిళనాడుకు చెందిన విద్యార్థుల బృందం ప్రయాగ్‌రాజ్ నగరాన్ని సందర్శించడంతో, ‘సంగం నగరి’లోని ‘కాశీ తమిళ సంగమం’ మార్మోగింది. ‘సంగం ఘాట్’ చేరుకున్న విద్యార్థుల బృందంలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది.
 
 ‘హర్‌హర్ మహాదేవ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. ప్రయాగ్‌రాజ్ స్థానికులు విద్యార్థి బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ‘త్రివేణి సంగమం’ వద్ద పవిత్ర స్నానం చేసిన తర్వాత, విద్యార్థుల బృందం ‘సంగం’ ఒడ్డున ఉన్న ‘హనుమాన్ జీ’ని సందర్శించారు. ఆ తర్వాత ‘శ్రీ ఆదిశంకర విమాన మండపాన్ని’ కూడా సందర్శించారు.
 
విద్యార్థుల కోసం జిల్లా యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌లో విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా అధికారులు విద్యార్థులను ప్రయాగ్‌రాజ్ నగరంలో, చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లారు.  అక్షయవత్ (‘నాశనం లేని మర్రి చెట్టు’గా హిందూ పురాణాల్లో పేర్కొన్న పవిత్రమైన అంజూర చెట్టు), చంద్రశేఖర్ ఆజాద్ పార్క్, ప్రయాగ్‌రాజ్ మ్యూజియం, శ్రీ స్వామినారాయణ మందిర్‌కు తీసుకెళ్లారు. ‘సంగం నగరి’లో పర్యటనను ముగించుకున్న తమిళనాడు విద్యార్థుల బృందం అయోధ్యకు బయలు దేరింది.
అయోధ్యకు బయలుదేరే సమయంలోనూ విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. సందర్శించిన వివిధ ప్రాంతాల్లో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు.  భాషాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు, ప్రత్యేక చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం తమిళ భాష, సంస్కృతి మీద అవగాహన ఉన్న అధికారులను ఎంపిక చేసి విద్యార్థులతో పంపింది.