కాంగ్రెస్ పార్టీ కి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
దాదాపు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. అధిష్టానం నిర్ణయం తర్వాత మర్రి శశిధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి..తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
 
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని విమర్శించారు. పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని  శశిధర్ రెడ్డి వెల్లడించారు. 
 
ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో తాను కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపారు. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందని,  ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటం చేయలేకపోతోందని చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితుల గురించి తాను చాలాసార్లు అధిష్టానానికి లేఖలు రాశానని, ఈ విషయంపై సోనియాగాంధీ కూడా స్పందించారని చెప్పారు.
అయితే.. సోనియా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిస్సహాయురాలిగా ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బు ఉన్నవాళ్లదే మాట చెల్లుతుందని అంటూ  గతంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడారని ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లు పార్టీలో ఉంటారో లేదో అన్న అలోచన ప్రజల్లో నాటుకుపోయిందని తెలిపారు.
 
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా ఆయన్ను ఎందుకు ఆరేళ్లు అధ్యక్షులుగా కొనసాగించారని ప్రశ్నించారు.
 
2018లో తనకు ఏ సర్వే ప్రకారం ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరి రాజీనామా చేయకుండానే ప్రమాణం స్వీకారరం చేసినప్పడు అనాడే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. అప్పడే రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా పోరాటం చేసి ఉంటే, ఇప్పుడు పార్టీకి ఈ దుస్థితి ఉండేది కాదని స్పష్టం చేశారు.
కోకాపేట భూముల విషయం ఏమైందని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అనే పేరు జనాల్లో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీ వేణుగోపాల్ ద్రోహిలా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లతో తాను సంతృప్తి చెందానని రేవంత్ అన్నారని చెప్పారు. మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు.
రేవంత్ రెడ్డి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మాత్రమే పని చేస్తారని ఆరోపిచారు. బంగారు బాతు గుడ్డు పెట్టే రేవంత్ రెడ్డిని ఠాగుర్ కాపాడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పుడున్న ఇన్ చార్జ్ ఠాగూర్ మరో ద్రోహి అంటూ మండిపడ్డారు.
అవినీతిపై మాట్లాడే అర్హతను కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హోంగార్డు అని సంబోధించడం వల్ల  కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా హోంగార్డ్స్, రేవంత్ మాత్రమే ఐపీఎస్ అధికారా..? అని ఎద్దేవా చేశారు. ఇవాళ హోంగార్డ్ పదవి నుండి తాను తప్పుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గీత దాటితే సీనియర్ నాయకులపైనా చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట్లాడడం తనకు బాధ కల్గించిందని పేర్కొన్నారు.
పార్టీలో తాను చాలా సీనియర్ నాయకుడని చెప్పారు. ఏదైనా అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాట్లాడితే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని విచారం వ్యక్తం చేశారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చేతి గుర్తు సూచించిన వారిలో తన కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.  కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని, ఇలాంటి పరిస్ధితి వస్తుందని తాను ఊహించలేదని చెప్పారు.