ఏపీలో పరిశ్రమలకు భూముల కేటాయింపుపై శ్వేతపత్రం కోరిన బీజేపీ


ఏపీలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిశ్రమలు, వాటికి కేటాయించిన  భూముల కేటాయింపుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది.  అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని, వారి బెదిరింపుల వల్ల రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోతోన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
 
వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పరిశ్రమను నెలకొల్పడానికి వచ్చిన జాకీ కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు డిమాండ్ ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్న సొంత పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నిలదీశారు.
దీనిపై వైఎస్ జగన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందనీ స్పష్టం చేసారు.  రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఇప్పటివరకు ఎన్ని భూములు ఇచ్చారు? అందులో వినియోగంలో ఉన్నవి ఎన్ని? నిరుపయోగంగా ఉన్నవి ఎన్ని?, పారిశ్రామికవేత్తలు ఎన్ని పరిశ్రమలు స్థాపించారు?, ఎంతమందికి ఉపాధిని కల్పించారనే ప్రశ్నలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ లేఖలో వీర్రాజు ముఖ్యమంత్రిని నిలదీశారు.
భూములను కేటాయించిన తరువాత పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు కాలేదనే విషయంపై ప్రభుత్వం ఏనాడైనా సమీక్ష జరిపిందా? ఆ విషయాలను ప్రజలకు ఎందుకు వివరించట్లేదని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న భూముల కేటాయింపుపైనా కూడా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
మొత్తంగా విభజన అనంతరం ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో జరిగిన భూ కేటాయింపుల వివరాలు వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు చాలావరకు కబ్జాలకు గురైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని  వీర్రాజు చెప్పారు.
అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడినట్లు వార్తలు వస్తోన్నాయని, ఈ కారణం వల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి అనుమానాలపై వివరణాత్మకంగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని తెలిపారు.

పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని, దీనికి అనుగుణంగా సింగిల్ విండో విధానంలో వాటికి అనుమతులను మంజూరు చేయాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినప్పుడే విభజనాంధ్రప్రదేశ్‌కు మోక్షం కలుగుతుందని వీర్రాజు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భూముల కేటాయింపు అనేది సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలని ఆయన సూచించారు. 
 
అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఆయా కాంట్రాక్టర్లను బెదిరించడం, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తోన్నట్లు వస్తోన్న వార్తలు.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతోందనీ ఆయన ఆరోపించారు.