పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండువగా జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు ఉదయం మిథున లగ్నంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు.

ఉదయం గజపటాన్ని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు. కంకణభట్టార్‌ మణికంఠ బట్టర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాల తర్వాత అమ్మవారి వాహన సేవలు బయట నిర్వహిస్తున్నామని తెలిపారు.

బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు  చేసినట్లు చెప్పారు. ఉదయం, సాయంత్రం వాహన సేవలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈవో దంపతులతో పాటు, , జెఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ  ఈవో లోకనాథం, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో ప్రభాకర్‌ రెడ్డి, తదితర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.