రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో నెలకొన్న వాయుగుండం కారణంగా రానున్న 48 గంటల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
వాయుగుండం ప్రభావం తమిళనాడుపై కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇండియన్‌ మెట్రో లాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం నైరుతిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని తెలిపారు, 
 
ప్రస్తుతానికి వాయుగుండం జాఫ్నా (శ్రీలం)కి తూర్పున 600 కి.మీ., కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 630 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఇది వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వివరించారు.
 
 దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. 
 
ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదని, వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణా సంస్థ ఎండి సూచించారు.
 
 అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటు-లో ఉండే 1070, 18004250101, 08632377118 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో వాయుగుండం రైతాంగం కంటిపై కునుకులేకుండాచేస్తోంది. వాయుగుండం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం చలితీవ్రత ఎక్కువైంది.

yal