తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.  కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు సైతం పడిపోయాయి. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు గ‌జగ‌జ వ‌ణుకుతున్నారు. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు పొగ‌మంచు క‌ప్పుకునే ఉంటుంది. పొగ‌మంచు కార‌ణంగా కొన్ని కోట్ల రోడ్డు ప్ర‌మాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.

సాధారణం కన్నా 4 నుంచి 6డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యల్పంగా కుమురంభీం జిల్లా సిర్పూరు(యూ) లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది.  ఆదిలాబాద్ లో 9.2, మెదక్ లో 10, హైదరాబాద్ నందనవనంలో 11.7 డిగ్రీలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణాలో గత పదేళ్లలో నవంబర్ నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలు కాగా.. ఆదిలాబాద్ లో 2017లో నమోదైంది. ఇదే విధంగా ఉష్ణోగ్రతలు తగ్గితే  పాత రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర, ఈశాన్య  ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నండటంతోనే చలి తీవ్రత పెరుగుతుందన్నారు.

ఏపీలోనూ చలిపులి పంజా విసురుతోంది. డిసెంబర్ రాకముందే ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పుకుంటోంది. చలి తీవ్రత అనూహ్యంగా పెరుగుతుండడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఆకాశం మేఘావృతమై పోయింది.

చాలా చోట్ల ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

పాడేరు 12, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మ‌రికొన్ని రోజులు ఇదే ప‌రిస్థితి కొసాగే ప‌రిస్థితి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అట‌వీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉన్న జిల్లాలో ప్ర‌జ‌ల బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతంగా మారాయి. చ‌లి మంట‌లు వేసుకుని కాచుకుంటున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలపై చ‌లి పంజా విసురుతుంది. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అధికారులు సూచిస్తున్నారు.