తిరుమలలో చతుర్దశ కలశ విశేష పూజ రద్దు 

తిరుమల కొండపై ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఆగమ సలహాదారుల సూచనల మేరకు విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు జరుగుతాయి. 
 
ఇందులో‌ భాగంగానే సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరుస్తారు. స్వామివారి సన్నిధిలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు.
అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి “సోమవారం” రోజు నిర్వహించే “చతుర్ధశ కలశ విశేష పూజ”ను  రద్దు చేశారు.  బలి జరిపిన అనంతరం సర్వదర్శనం భక్తులను అనుమతించారు. ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవ సేవను నిర్వహిస్తారు.
సర్వదర్శనం నిలిపేసిన తర్వాత శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి జరుగుతాయి. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. వారి సర్వదర్శనం అయిన తరువాత ఆగమోక్తంగా చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.