సావర్కర్ పై రాహుల్ వాఖ్యల పట్ల  భగ్గుమంటున్న మహారాష్ట్ర 

`భారత్ జోడో యాత్ర’లో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత స్వాతంత్ర సమరయోధుడు వి డి సావర్కర్  గురించి అనుచిత వాఖ్యలు ఆ రాష్ట్రంలో ఆగ్రవేశాలు కలిగిస్తున్నాయి. హిందుత్వ‌వాది వినాయక్ దామోద‌ర్ సావార్క‌ర్‌పై రాహుల్  చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు మిత్రపక్షాలతో సహితం కన్నెర్రకు కారణం అవుతున్నాయి.
 బ్రిటీష‌ర్ల‌కు సావార్క‌ర్ భ‌య‌ప‌డ్డార‌ని, వాళ్ల‌కు సేవ‌కుడిగా ప‌ని చేసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించార‌ని, దీని కోసం బ్రిటీష‌ర్ల‌కు సావార్క‌ర్ లేఖ‌లు కూడా రాసిన‌ట్లు వరుసగా రెండో రోజు రాహుల్ విమర్శలు గుప్పించారు. కొన్ని రోజుల క్రితం సావార్క‌ర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే.
ఈ నేప‌థ్యంలో తిరిగి ఆయన  కావాలంటే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌ను అరెస్టు చేసుకోవ‌చ్చు అని కూడా రాహుల్ స‌వాల్ చేశారు. సావార్క‌ర్‌ది ఒక విజ‌న్ అని, మ‌హాత్మా గాంధీది మ‌రో విజ‌న్ అని, దేశంలో ఈ రెండు విజ‌న్ల మ‌ద్య ఫైట్ న‌డుస్తోంద‌ని, తాము చ‌ర్చ‌ల‌కు ఓపెన్‌గా ఉన్నామ‌ని, త‌మ పార్టీలో నియంత‌లు లేర‌ని రాహుల్ పేర్కొన్నారు.
అండ‌మాన్ జైలులో ఉన్న సావార్క‌ర్‌.. ఆ స‌మ‌యంలో బ్రిటీష‌ర్ల‌కు లేఖ రాశార‌ని, భ‌యం వ‌ల్లే అత‌ను ఆ లేఖ‌లు రాసిన‌ట్లు రాహుల్ తెలిపారు. రాహుల్ వాఖ్యాలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా సమర్ధించారు.

రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్ప‌ద కావ‌డంతో శివ‌సేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి  ఉద్ధ‌వ్ ఠాక్రే రెండు రోజుల అనంతరం అసహనం వ్యక్తం చేశారు. వీడీ సావార్క‌ర్ ప‌ట్ల త‌మ‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌ని పేర్కొంటూ సావార్క‌ర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తిర‌స్క‌రించారు. అయితే `స్వేచ్ఛ’ కోసం తాము రాహుల్ యాత్రకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు.

కాగా, హిందూత్వ సిద్ధాంతకర్తను అవమానిస్తే రాష్ట్ర ప్రజలు సహించరని  ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే  హెచ్చరించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 10వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సింపోజియంలో సావర్కర్‌ను అవమానిస్తే మహారాష్ట్ర ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోరని షిండే స్పష్టం చేశారు.

దివంగత సమరయోధుడిని అవమానించినందుకు రాష్ట్రంలో భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని షిండే నేతృత్వంలోని శివసేన (బాలాసాహెబ్)కి అనుబంధంగా ఉన్న లోక్‌సభ ఎంపీ రాహుల్ షెవాలే డిమాండ్ చేశారు. షిండే వర్గం, బిజెపి రాహుల్ వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాకరే మౌనాన్ని ప్రశ్నిస్తూ, అటువంటి పార్టీతో పొత్తులో కొనసాగదని ఎద్దేవా చేశారు.  గత వారం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

బిజెపి నిరసన ప్రదర్శన 

గత నెలలో కర్ణాటకలో సహితం యాత్ర సందర్భంగా రాహుల్ ఇటువంటి వాఖ్యలు చేశారు.  స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు బీజేపీ ఆరోపించింది. రాహుల్ వాఖ్యలను ఖండిస్తూ ముంబైలో బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. `జొటా మారో ఆందోళన’ పేరుతో బిజెపి ఎమ్యెల్యే రామ్ కదమ్ నేతృత్వంలో నిరసన జరిపారు. 

రాహుల్ వాఖ్యల పట్ల మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ కు దేశ చరిత్ర,  కాంగ్రెస్ చరిత్ర తెలియదని దుయ్యబట్టారు. తరచూ సావర్కర్ పై అవమానకర వాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ సావర్కర్ పై అనుచిత వాఖ్యలు చేస్తుంటే జోడో యాత్రలో ఆదిత్య థాకరే ఏవిధంగా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. 

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

మరోవంక, వీర్ సావర్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ ముంబైలోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నారు.‘‘రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్‌ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను’’అని రంజిత్ చెప్పారు.

హిందుత్వ సిద్ధాంతకర్త, వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి పెన్షన్ తీసుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. హింగోలిలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గిరిజన సదస్సులో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చేరుకుంది.