అధికారం రాకుంటే 2024 టిడిపికి చివరి ఎన్నికలు కావచ్చు!

ప్రజలు కనుక 2024లో కూడా తెలుగు దేశం పార్టీని ఎన్నుకుని అధికారం కట్టబెట్టకపోతే, తమ పార్టీకి అదే చివరి ఎన్నిక అవుతుందని టిడిపి అధినేత,  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూల్ జిల్లాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించిన ఆయన భావోద్వేగానికి లోనై ప్రసంగించారు.
 
 “నేను మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్నా…అది మీరు వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఎన్నుకుంటేనే సాధ్యం…అలా కాకుంటే టిడిపికి అదే చివరి ఎన్నిక అనుకోవచ్చు…” అంటూ చంద్రబాబు తెలిపారు. ”మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకివే చివరి ఎన్నికలు.. టీడీపీని గెలిపించండి, అసెంబ్లీని గౌరవసభ చేస్తా’’.. అంటూ వ్యాఖ్యానించారు. 
తాను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. “ మీరు నన్ను దీవిస్తారా? నన్ను నమ్ముతారా?” అని ప్రశ్నించినప్పుడు అక్కడి ప్రజలు సానుకూలంగానే స్పందించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 2021 నవంబర్ 19న నిండు సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనని, తన భార్యను అవమానించిందని, తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు తాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని నాడే ప్రతిజ్ఞ చేశానని గుర్తుచేశారు.
 
 “ నా పోరాటం భవిష్యత్తు తరం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇదేమి పెద్ద విషయం కాదు, నేనిదివరకే సాధించిన ప్రగతి మీకు మోడల్‌గా ఉంటుంది” అని పేర్కొన్నారు. కొందరు తన వయస్సును చూపెడుతూ అపహాస్యం చేస్తున్నారని, తానింకా శారీరకంగా ఫిట్‌గానే ఉన్నానని పేర్కొన్నారు. 
 
తాను, ప్రధాని నరేంద్ర మోదీ సమ వయస్కులమేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 79 ఏళ్ల వయస్సులో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. తానింకా 72లోనే ఉన్నానని టిడిపి నేత చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగేసిందని ఆయన విమర్శించారు.
 
గురువారం ఆదోనిలో జరిగిన రోడ్ షో లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “నేనేమీ సినిమా యాక్టర్ కాదు… నా సినిమా సూపర్ హిట్ కాలేదు. కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టిడిపి రావాలి అని సంఘీభావం తెలిపేందుకు వీరంతా వచ్చారు” అంటూ ఉద్వేగం ప్రదర్శించారు.
 
ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ “మూడున్నరేళ్లలో అభివృద్ది ఆగిపోయింది… రౌడీయిజం పెరిగిపోయింది… దోపిడీ, నేరాలు పెరిగిపోయాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ కుటుంబ వివాదాన్ని కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. రౌతుకొద్దీ గుర్రం అంటారు… అందుకే పోలీసులు ఇలా అయ్యారు” అంటూ విమర్శించారు.