విమానాల్లో మాస్క్ తప్పనిసరి కాదు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడిలిస్తోంది. ఇంతకాలం విమాన ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించిన విమానయాన మంత్రిత్వ శాఖ ఒక్కొక్క అంశంపై సడిలింపులు ఇస్తోంది. కాగా, ఇకమీదట విమాన ప్రయాణికులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని, అది తప్పనిసరి కాదని తెలిపింది.
 
విమాన ప్రయాణంలో ఇకపై ఫేస్ మాస్క్ లు తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అయితే కరోనావైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు వీటిని ఉపయోగించడమే మంచిదని మంత్రిత్వ శాఖ తెలిపింది.  విమాన ప్రయాణ సమయంలో మాస్క్ కానీ, ఫేస్ కవర్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన విషయంపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
అన్ని విమానయాన సంస్థలకు మంత్రిత్వ శాఖ తన ఆర్డర్‌లో ఫేస్ మాస్క్ ల గురించి ఓ ప్రకటన జారీ చేసింది. మాస్క్ లేకున్నా విమానాల్లో జర్నీ చేయొచ్చని, దీనిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది.
మాస్క్‌లు ఇతరత్రా వస్త్రాలు ముఖానికి తగిలించుకోవడం వ్యక్తిగతం అని, అయితే వీటిని ధరిస్తే మంచిదని హితవు పలికారు.  కరోనా వైరస్ నిర్వాహణల పద్ధతిలో తరచూ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడు తాజా నిర్ణయాన్ని వెలువరించారు. ఇప్పటికైతే కరోనా తీవ్రత లేదు. అయితే సమసిపోలేదు.

ఈ నేపథ్యంలో ఎవరికి వారు విమాన ప్రయాణాల దశలో సొంత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ల ధారణ వారివారి ఇష్టానికే వదిలిపెడుతున్నామని తెలిపారు. ఇప్పటి నిర్ణయం నేపథ్యంలో ఇకపై విమాన ప్రయాణాల దశలో మాస్క్‌లు వేసుకోకపోతే ఫైన్ లేదా ఇతరత్రా శిక్షలుంటాయనే అధికారిక ప్రకటనలు వెలువరించడం ఏదీ ఉండదని తెలిపారు.

దేశంలో ఇప్పుడు మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం ౦.2 శాతంగానే ఉంది. రికవరీ రేటు దాదాపు 99 శాతానికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి నయం అయిన వారి సంఖ్య 4,41,28,580కు చేరుకుంది, కరోనాతో మరణాల సంఖ్య 1.19 శాతంగా రికార్డు అయింది.