కేసీఆర్ నే చేర్చుకో లేదు… కవితను ఎలా చేర్చుకుంటాం!

తన కుమార్తె కవితను తమ పార్టీలో చేరమని బిజెపి వారు బెదిరించారని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు.  డిల్లీలో బీజేపీ చుట్టూ కేసీఆర్‌  తిరిగితేనే తాము పట్టించుకోలేదని …  ఇక కేసీఆర్ బిడ్డను తాము పార్టీలో చేర్చుకుంటామా? అని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు.
 
ఫాం హౌస్ ఇష్యూతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలు ఎంత భయపడుతున్నరో వాళ్ల మొఖాలు చూస్తేనే అర్థమైతుందని ధ్వజమెత్తారు. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలన్న డిమాండ్ ను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని సంజయ్ ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు బ్రోకర్ల కాల్ లిస్ట్ తీస్తే కేసీఆర్ ఆడిన నాటకం నాటకం బయటపడ్తదని పేర్కొన్నారు.
 
కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంలేదని చెప్తే ముందస్తుకు సిద్ధమవుతున్నట్లేనని సంజయ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి అందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నడని ఆయన ఆరోపించారు.
 
ఇన్ని రోజులు గడిచినా ఆ నలుగురిని ఎందుకు బయటకు రానిస్తలేడో సమాధానం చెప్పాలని నిలదీసేరు. కేసీఆర్ ఎలాంటి యుద్ధం చేసినా తాము సిద్ధంగానే ఉన్నామంటూటీఆర్ఎస్ కంటే ముందు యుద్ధం ప్రారంభించామని తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ లో భయం మొదలైందన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే గుర్తించారని కూడా చెప్పారు. అసలు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, అదే సమయంలో టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు.

ఖర్గేను కలిసిన కవిత!

ఎమ్మెల్సీ కవితతో బిజెపి సంప్రదింపులు జరిపిందన్నకేసీఆర్‌ వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ డి అరవింద ఖండించారు. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని మండిపడ్డారు. పైగా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌ గా మార్చే సమయంలో కవితను పిలవలేదని గుర్తు చేస్తూ కేసీఆర్‌ను బెదిరించటానికే కవిత కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన ఆరోపించారు.