అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం

 
భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులను రక్షించడం కోసం ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి,దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు వీరన్నగారి సురేందర్ రెడ్డి హెచ్చరించారు.
 
మాన్యాలు రక్షించే బాధ్యత ప్రతి హిందూపై ఉందని పేర్కొంటూ వందల సంవత్సరాలుగా వస్తున్న వారసత్వ సంపదను కొల్లగొట్టేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సాగనివ్వమని స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంప చోడవరం నియోజకవర్గంలో గల పురుషోత్తమ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి గోశాలను విశ్వహిందూ పరిషత్ బృందం సందర్శించింది.
 
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గోశాలలోని గోవులకు మాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కొంతమంది కావాలని గోశాలపై విధ్వంసం సృష్టించిన ఆనవాళ్లను, పగిలిపోయిన రేకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాములవారి అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు. 
 
అందుకు విశ్వహిందూ పరిషత్ దే సంపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ చట్టాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించి రాజకీయ అండదనులతో అక్రమాలకు పాల్పడితే విశ్వహిందూ పరిషత్ రూపంలో స్వయంగా రాముడే దిగివచ్చి తన భూములు తాను కాపాడుకుంటాడని భరోసా వ్యక్తం చేశారు. ఇది సత్యం అని తెలిపారు. 
 
రాజకీయం అశాశ్వతమని, ధర్మం అనేది శాశ్వతం అని చెబుతూ అది ఎప్పటికీ ఎవరికీ తెలవంచదని హెచ్చరించారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా చివరకు ధర్మానిదే విజయం అని చెప్పారు. ఇక్కడి దేవుడి భూములు మొత్తం సర్వే చేసి, రికార్డులు ఆధారంగా ఎంత భూమి ఉందో దానికి అంతటికి ఫెన్సింగ్ చేసి దేవుడికి దక్కేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేత డిమాండ్ చేశారు. 
 
ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్య తీసుకోవాలని ఆయన సూచించారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమాలకు పాల్పడితే చట్ట పరంగా శిక్ష అనుభవించడం తప్ప ఒరిగేదేమీ లేదని ఆయన హెచ్చరించారు. రాముడి భూములు కాపాడే విషయంలో విశ్వహిందూ పరిషత్ బృహత్తర ఉద్యమం నిర్మిస్తుందని ప్రకటించారు. యావత్ రామభక్తులను, హిందువులను చైతన్యం చేసి భద్రాచలం భూములను భద్రంగా కాపాడుతామని నాయకులు స్పష్టం చేశారు.
తాత్కాలిక ప్రకటనలు, చిలిపి చేష్టలతో సమయం వృధా చేసుకుని సంబరపడే కంటే.. రాములవారి భూముల పేరుకు రాకుంటేనే మంచిదని భూముల ఆక్రమించుకున్న రైతులకు హితవు పలికారు.  కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్ కుమార్, ఖమ్మం విభాగ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్ల , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్య అధ్యక్షులు అవులూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు