ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలి

ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా ప్రారంభమైన రెండు రోజుల జీ 20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆహారం, ఇంధనంపై జరిగిన సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ  రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. 

మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తప్పనిసరిగా అవసరం అని ఆయన స్పష్టం చేశారు.  ఉక్రెయిన్ పై రష్యా దాడిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశ చమురు, గ్యాస్​ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రధాని మోదీ కోరారు.

స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్​ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరిపై ఉందని దేశాధినేతలకు మోదీ  పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల సంక్షోభం ప్రతి దేశంలోనూ సవాల్​ విసురుతోందని పేర్కొన్నారు. 

వాతావరణ మార్పులు, కరోనా ఉజృంభణ, రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం పరిణామాలు ప్రపంచంలో విధ్వంసం సృష్టించాయని చెబుతూ వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జీ 2‌‌0 సదస్సుకు నాయకత్వం వహించిన ఇండోనేషియాను మోదీ  అభినందించారు.

బైడెన్, మోదీల సంభాషణ

 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ  అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను కలుసుకున్నారు. ఈ వేదికపై కలుసుకున్న మోదీ, బైడెన్ లు సరదాగా నవ్వుతూ కనిపించారు. మోదీ చెప్పేది వింటూ బైడెన్ సరదాగా నవ్వుతున్న వీడియోను ప్రధాని మోదీ కార్యాలయం ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ ను మోదీ  కలుసుకున్నారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాక్రన్ కు ప్రధాని అభినందనలు తెలిపారు. 

యూకె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీతో  జి20 సదస్సులో భేటీ అయ్యారు. గతంలో అక్టోబర్‌లో ప్రధాని మోడీ, సునాక్ ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. కానీ ముఖాముఖి కలుసుకోవడం ఇదే ప్రథమం. రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై సమతుల్య, సమగ్ర చర్చలపై వారిద్దరు ఇదివరలో చర్చించారు.

ప్రారంభోత్సవ ఉపన్యాసంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఈ సమావేశాలను ప్రారంభించారు. ప్రపంచంపట్ల బాధ్యతగా ఫీలయితే వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

యుద్ధం ఆగకుంటే ప్రపంచం ముందుకు సాగడం కష్టమని, ఇది మరో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయొచ్చని జోకో విడోడో ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిని పునరుద్ధరించాలని, యూఎన్ ఛార్టర్‌ను గౌరవించాలని, ఉక్రెయిన్ భూసమగ్రతను ఆమోదించాలని  ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ  పిలుపునిచ్చారు.

సదస్సులో కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఐరోపా సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపైన జి20 దేశాలు చర్చించనున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపైన విస్తృతంగా చర్చ జరుగనుంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు నేతలు మార్గాలు వెతకనున్నారు.