అభిషేక్​, నాయర్​లకు సీబీఐ కేసులో బెయిల్​.. ఈడీ కేసులో కస్టడీ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  నిందితులు బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లను 14 రోజుల కస్టడీకి అడుగుతూ దాఖలైన పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్ట్ లో విచారణ జరిగింది. జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు అభిషేక్, విజయ్ నాయర్ హాజరయ్యారు.
 అయితే సీబీఐ కేసులో ఇద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. చెరో రూ.2 లక్షల బెయిల్ బాండ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఈడీ కేసులో మనీలాండరింగ్​ ఆరోపణలపై విచారణ చేసేందుకు అభిషేక్ రావు, విజయ్ నాయర్ ఇద్దరికీ 5 రోజుల కస్టడీకి స్పెషల్ కోర్టు అనుమతించింది . ఈడీ కస్టడీలో ఉండగా కుటుంబ సభ్యులను అభిషేక్ ,విజయ్ నాయర్  కలిసేందుకు అవకాశం ఇచ్చింది.
ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న విజయ్ నాయర్ , అభిషేక్ బోయినపల్లిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే తమ కస్టడీలో ఉన్న శరత్ చంద్రా రెడ్డి, వినయ్​ బాబులతో కలిపి వీరిని ఈడీ విచారణ జరపనుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారి, కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.
“నవంబర్ 8, 13 తేదీల్లో విచారణ జరిగింది. సెప్టెంబర్ 6న నాయర్ స్థలంలో, నివాసంలో సోదాలు నిర్వహించాం. మరో 164 చోట్ల తనిఖీలు చేశాం. సెప్టెంబర్ 6న నాయర్ వాంగ్మూలాన్ని నమోదు చేశాం.  అభిషేక్ ను సెప్టెంబర్ 17న విచారించాం.  జైలులో రెండుసార్లు వాంగ్మూలం నమోదు చేశాం. ఇద్దరు ఇచ్చిన సమాధానాలు కేసును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి”అని ఈడీ  తరపు న్యాయవాది పేర్కొన్నారు.
“దాదాపు 60 చోట్ల సోదాలు జరిపారు. అక్కడ ఏమీ దొరకలేదు. ఈరోజు సీబీఐ కేసులో బెయిల్​ పై తీర్పు ఉంది.  అందుకే కావాలని.. అభిషేక్ ను ఈడీ అధికారులు నిన్న  అరెస్టు చేశారు”అని బోయినపల్లి అభిషేక్ తరపు న్యాయవాది శ్రీ సింగ్ వాదించారు.
“ఈ కేసులో సీబీఐ వీరిని అరెస్టు చేసింది. ఇప్పుడు ఈడీ విడిగా ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటోంది. అక్టోబర్ 27న బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీని తర్వాత అక్టోబర్ 29న ఈడీ వినయ్ ని కూడా విచారించింది. నవంబర్ 13న ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది”అని విజయ్​ నాయర్ తరపు న్యాయవాది రెబెకా జాన్ వాదనలు వినిపించారు.
విజయ్​ నాయర్​ నేపథ్యంలోకి వెళితే ఆయన ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ఢిల్లీ, పంజాబ్​ రాష్ట్రాలకు కమ్యూనికేషన్ ఇంచార్జిగా ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్​ పాలసీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో విజయ్​ నాయర్​ ను గతంలో సీబీఐ అరెస్టు చేసింది.  ఆప్​ కు సంబంధించిన పార్టీ పదవిని చేపట్టడానికి ముందు, విజయ్​ నాయర్​ ఓన్లీ మచ్​ లౌడర్​ (ఓఎంఎల్​) అనే ఈవెంట్స్​ కంపెనీ సీఈవో గా పనిచేశారు. లిక్కర్​ స్కాం కేసులో విజయ్​ నాయర్​ ను సీబీఐ ఏ5 నిందితుడిగా చేర్చింది.
ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో  నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్​రావు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త. ఈయనకు రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. కేసులో తమకు సహకరించడం లేదని, తప్పు దోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని సీబీఐ అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించింది.  లిక్కర్​ స్కామ్​లో తెలంగాణ నుంచి అరెస్టయిన తొలి వ్యక్తి అభిషేక్​రావే.
లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో రూ.3.85 కోట్లు అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండోస్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రుకు వచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ముందుగా సౌత్‌‌ లాబీ పేరుతో ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొంది. వీటికి సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉందని కస్టడీ పిటిషన్‌‌లో సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు.
లిక్కర్​ స్కాంలో డబ్బుల వ్యవహారం మొత్తం ఇండోస్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రు చూశారనే అభియోగాలు ఉన్నాయి. ఇదే కేసులో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిసి సమీర్​ మమేంద్రు వ్యాపారం చేస్తున్నారు. ఈ స్కామ్​ లో ఇద్దరూ కలిసి రూ.2 కోట్ల 30 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా వసూలు చేసిన డబ్బులను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి.