అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. ఇండోనేషి యాలోని బాలీలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో వేర్వేరు టేబుళ్లపై కూర్చున్న ఇద్దరూ అగ్రనేతలు ద్వైపాక్షిక భేటీలో మాట్లాడారు.
మన భేటీ ప్రపంచ దేశాలను ఆకర్షించిందని, ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలతో మనం కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
ద్వైపాక్షిక బంధాల్ని బలోపేతం చేసేందుకు సరైన మార్గాన్ని ఎన్నుకోవాలని చెబుతూ వ్యూహాత్మక అంశాల్లో చర్చలు ఉండాలని సూచించారు. రెండు దేశాధినేతలు అణుయుద్ధంకు ఎట్టి పరిస్థితులలో దారితీయరాదని, అటువంటి యుద్ధంలో ఎవ్వరు విజేతలు- పరాజితులు అంటూ ఉండరని రెండు దేశాలమధ్య నెలకొన్న ఏకాభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయీగిస్తామనే బెదిరింపుల పట్ల ఇరువురు తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసక యుద్ధం, అణ్వాయుధాలు ఉపయోగిస్తామని బెదిరంపులను చైనా అధినేత దృష్టికి బైడెన్ తీసుకు వచ్చారు. వాతావరణ మార్పు, ఆహార భద్రత వంటి కీలక సవాళ్ళను ఎదుర్కోవడంలో మన రెండు దేశాలు కీలక పాత్ర వహించాలని ప్రపంచం భావిస్తోందని బైడెన్ చైనా అధ్యక్షునికి తెలిపారు.
అమెరికా, చైనా మధ్య ఘర్షణను నివారించడమే తన ముఖ్య ఉద్దేశమని పేర్కొంటూ రెండు దేశాలు స్నేహపూర్వకంగా పనిచేయాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. తైవాన్ అంశంలో రెండు దేశాల మధ్య గత కొన్నాళ్ల నుంచి ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నసమయంలో వీరి భేటీ ఆసక్తి కలిగిస్తుంది.
“మన రెండు దేశాలు మన మధ్యగల విబేధాలను నియంత్రించుకోగలమని, ఘర్షణలు చెలరేగకుండా పోటీ పడటం నివారించుకోగలమని, పరస్పర సహకారం అవసరమైన అత్యవసర ప్రపంచ సమస్యలపై కలసి పనిచేయగలమని నేను భావిస్తున్నాను” అని బైడెన్ స్పష్టం చేశారు. అయిదేళ్ల క్రితం దావోస్ సభలో మిమ్మల్ని కలిశానని, మీరు దేశాధ్యక్షుడు అయ్యాక, ఆన్‌లైన్ కాల్స్ ద్వారా టచ్‌లో ఉన్నామని, కానీ ముఖాముఖీగా ఎదురుపడడం కీలకమని, అందుకే ఇవాళ భేటీ అవుతున్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సందర్భంగా చెప్పారు.
ఎంతో అనుభవం నేర్చుకున్నామని, ఎన్నో పాఠాలు కూడా నేర్చుకున్నామని చెబుతూ చరిత్రే మనకు మంచి పుస్తకం అని, ఆ చరిత్రను మనం అద్దంలా చూడాలని, మన భవిష్యత్ ను దానినే సూచింపనిద్దామని పేర్కొన్నారు. అమెరికా, చైనా మధ్య ఉన్న సంబంధాలు కీలకమైందని, రెండు పెద్ద దేశాలకు చెందిన నేతలుగా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని జిన్‌పింగ్ తెలిపారు.
“మన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు రెండు దేశాలకు ప్రయోజనంకోసమే కాకుండా, ప్రపంచ ప్రయోజనాలకోసం కూడా ఆరోగ్యకరంగా, స్థిరమైన వృద్ధి దిశలో సాగేవిధంగా తీసుకెళ్లేందుకు నేను మీతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని బైడెన్ కు తెలిపారు.
తైవాన్ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ లైన్ దాటొద్దని అమెరికాకు జిన్ పింగ్ సూచించారు. తమ దేశ ప్రయోజనాలతో ముడిపడిన అత్యంత కీలకమైన తైవాన్ అంశంలో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా నడుచుకుంటే చైనా, అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని పేర్కొన్నారు.
వ్యూహాత్మక ప్రాధాన్యత గల చైనా- అమెరికా సంబంధాలతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రధాన అంశాలపై లోతయిన అభిప్రాయాలను వ్యక్తం చేసుకొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా స్పష్టం చేశారు.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్