బాలిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

బాలిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
జీ20 దేశాల సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోమ‌వారం ఇండోనేషియా వెళ్లారు. ప్ర‌త్యేక విమానంలో వెళ్లిన ఆయ‌న‌కు బాలిలో ఘనస్వాగతం లభించింది. ఎయిరిండియా వన్ విమానంలో బాలి చేరుకున్న ప్ర‌ధానికి ఇండోనేషియా ప్రభుత్వ వర్గాలు సంప్రదాయకంగా స్వాగతం పలికాయి.
 
 భార‌త ప్ర‌ధాని గౌరవార్థం ఎయిర్ పోర్టులోనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్ర‌ధానికి స్వాగతం పలికేందుకు ఇండోనేషియా ప్రభుత్వ పెద్దలతో పాటు సైనిక ఉన్నతాధికారులు విచ్చేశారు. అటు బాలిలో భారతీయులు కూడా స్వాగతం పలికారు.
 
బాలిలో జరగబోయే జి-20 సదస్సులో అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే అంశాలపై చర్చించనున్నట్లు ప్రధాని విదేశీ పర్యటనకు బయలుదేరేముందు తెలిపారు. అంతర్జాతీయ అభివృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్‌ పరివర్తన వంటి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే కీలకాంశాలపై జి 20 నేతలతో చర్చించనునుట్లు మోదీ  చెప్పారు. 
 
 మూడు రోజుల ఈ పర్యటనలో ప్రపంచ సవాళ్ల పరిష్కారానికి భారతదేశ నిబద్ధత, చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిని వివరించనున్నట్టు ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ‘వసుదైక కుటుంబం-ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిత’ అనే నినాదంతో త్వరలో జీ-20 గ్రూప్‌నకు భారత్‌ సారథ్యం వహించనుందని గుర్తు చేశారు. 
 
 సదస్సు ముగింపులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ-20 సారథ్య బాధ్యతలను భారత్‌కు అప్పగించనున్నారు. డిసెంబరు 1 నుంచి అధికారికంగా జీ-20కి భారత్‌ సారథ్యం వహించనుంది. వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్న జీ-20 సదస్సుకు సభ్యదేశాలను ఇప్పుడే వ్యక్తిగతంగా తాను ఆహ్వానించనున్నట్టు మోదీ ప్రకటించారు. 
 
జీ-20లో భారత్‌, అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, అర్జెంటీనా, ఆస్ర్టేలియా, బ్రెజిల్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, కొరియా, మెక్సికో, సౌదీ, దక్షిణాఫ్రికా, టర్కీ సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సహకారంలో జీ-20 కీలక ప్రభావం కలిగి ఉంది. 
 
ప్రపంచ జీడీపీలో 85 శాతాన్ని జీ-20 దేశాలు కలిగి ఉన్నాయి. అలాగే, ప్రపంచ వర్తకంలో 75 శాతాన్ని ఈ దేశాలు నిర్వర్తిస్తున్నాయి.  ఈ సమావేశాల్లో ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు.
 
బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా సోమవారం బాలికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో రక్తపాతానికి, తద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమైన పుతిన్‌ జీ-20 సదస్సుకు ముఖం చాటేస్తున్నాడని సునాక్‌ విమర్శించారు. దుష్ట దేశం రష్యాపై ప్రపంచం సమన్వయంతో చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 
 
ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడమే మాంద్యం ముప్పునకు ఏకైక పరిష్కారమని అమెరికా ఆర్థికమంత్రి జనెట్‌ యెల్లెన్‌ స్పష్టం చేశారు.  ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆహార సరఫరా గొలుసు తెగిపోయిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నారు.