టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో టీమిండియా

టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓడిపోయి ఇంటిదారి పట్టిన టీమిండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మాత్రం నెంబర్ వన్గా నిలిచింది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తంగా 268 రేటింగ్ పాయింట్లతో రోహిత్ సేన టాప్ పొజీషన్లో కొనసాగుతోంది. 
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ టీ20 ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 265 రేటింగ్ పాయింట్లతో బట్లర్ సేన సెకండ్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్..258 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
సౌతాఫ్రికా నాల్గో స్థానంలో, సెమీ ఫైనలిస్ట్ న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు టాప్ 10లో కొనసాగుతున్నాయి.
 
టీ20 ప్రపంచకప్‌ 2022లో బెస్ట్ టీమ్ను ఐసీసీ ప్రకటించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత్భుతంగా రాణించిన 11మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక‌చేసింది. అందులో ప్ర‌పంచ‌క‌ప్ విజేత ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, భార‌త జ‌ట్టు నుంచి ఇద్ద‌రు, పాకిస్థాన్ త‌ర‌ఫున ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. న్యూజిలాండ్, ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ టీమ్ నుంచి ఒక్కో ఆట‌గాడిని క్రికెట్ ఆస్ట్రేలియా సెల‌క్ట్ చేసింది.
 
ఈ జట్టులో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా బట్లర్‌, హేల్స్‌ను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, ఐదో స్థానంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)లకు అవకాశం ఇచ్చింది. 
 
ఆతర్వాత ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్‌ రజా (జింబాబ్వే), షాదాబ్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)లకు ఛాన్స్‌ ఇచ్చింది. బౌలర్లుగా సామ్‌ కర్రన్‌, అన్రిచ్‌ నోర్జే (సౌతాఫ్రికా), మార్క్‌ వుడ్‌, షాహీన్‌ అఫ్రిది (పాకిస్తాన్‌)లకు అవకాశం కల్పించింది.  ఈ జట్టుకు జోస్‌ బట్లర్‌ను సారధిగా ఎంపిక చేసిన ఐసీసీ.. వికెట్‌కీపర్‌గానూ అతన్నే ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.