రాష్ట్ర‌ప‌తి ముర్ముపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైర‌ల్ కావ‌డంతో.. తృణ‌మూల్ పార్టీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  దీంతో మంత్రి అఖిల్ గిరి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 17 సెకండ్లు ఉన్న ఓ వీడియో క్లిప్‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము గురించి మంత్రి గిరి అనుచిత కామెంట్ చేశారు.
 
మన రాష్ట్రపతి ఎలా ఉంటారు.. అంటూ ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ వాళ్ల‌కు తాను మంచి క‌నిపించ‌డం లేదంటూ.. రూపం ద్వారా ఎవ‌ర్నీ అంచ‌నా వేయ‌లేమ‌ని, భార‌త రాష్ట్ర‌ప‌తిని గౌర‌విస్తామ‌ని, కానీ ఆ రాష్ట్ర‌ప‌తి రూపం ఎలా ఉందంటూ మంత్రి గిరి వ్యాఖ్య‌లు చేశారు.
 నందీగ్రామ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. “నేను బాగా కనిపించాను అని ఆయన (బీజేపీ నేత సువెందు అధికారి) అంటుంటారు. ఆయన ఎంత అందంగా ఉన్నారు! మనం ఒకరి అందం చూసి వారి గురించి నిర్ణయం తీసుకోము. మనం మీ రాష్ట్రపతి హోదాను గౌరవిస్తాము. కానీ మీ రాష్ట్ర పతి ఏ విధంగా కనిపిస్తారు?” అని ప్రశ్నించారు.
అయితే తన వాఖ్యలపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో ఆయన వెనుకడుగు వేసి, తాను `ప్రెసిడెంట్’ అని అన్నాను, కానీ ఎవ‌రి పేరును ఎత్త‌లేద‌ని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఒక‌వేళ భార‌త రాష్ట్ర‌ప‌తి త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల అవ‌మానంగా ఫీల‌యితే, దానికి తాను సారీ చెబుతున్నాని మంత్రి అఖిల్ గిరి పేర్కొన్నారు.
ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. అఖిల్ గిరిని తక్షణమే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన్ని మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
ఈ వీడియోపై పలువురు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం  చేస్తూ  గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. పైగా ఆ సమయంలో మహిళా సంక్షేమ మంత్రి శశి పంకా కూడా అక్కడే ఉన్నారని విస్మయం వ్యక్తం చేశారు. 
 
టిఎంసి మంత్రి వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ తీవ్రంగా విమర్శించారు. ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందినవారు. టిఎంసి గిరిజనులకు వ్యతిరేకంగా ఉందని… అది వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుందని మజుందార్‌ పేర్కొన్నారు. 
 
ఇక బిజెపి నేషనల్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌ఛార్జీ, పశ్చిమబెంగాల్‌ కో- ఇంఛార్జి అమిత్‌ మాల్వియా ఒక ట్వీట్‌ చేస్తూ  ‘మీరు రాష్ట్రపతిని అవమానించారు. మేము రూపం గురించి పట్టించుకోము. అయితే రాష్ట్రపతి మీకు ఎలా కనిపిస్తున్నారు? మమతా బెనర్జీ ఎప్పుడూ గిరిజన వ్యతిరేకినే. అందుకే గిరిజన వర్గానికి చెందిన ముర్ముకు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఆమె మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రి కూడా సిగ్గుపడేలా ప్రసంగించారు’ అని పేర్కొన్నారు.  అయితే ఆ మంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలకు తాము బాధ్యత వహించబోమని టిఎంసి తెలిపింది.