అమరావతి భూముల వ్యవహారంపై `సుప్రీం’ లోతుగా విచారణ

అమరావతి భూముల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గత టిడిపి ప్రభుత్వ హాయంలో అమరావతి భూసమీకరణ అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. 
 
అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయగా.. దానిపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తునకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై లోతుగా విచారణ చేపడుతామనితెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
అమరావతి భూముల వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించాల్సిన అంశమని ఆయన తెలిపారు. అమరావతి భూములపై పలు నోటిఫికేషన్లు ఇచ్చామని, సిట్‌ ఏర్పాటు చేశామని, పోలీసు నోటీసులు కూడా ఇచ్చామని అయినప్పటికీ హైకోర్టు మూడు డాక్యుమెంట్లు విస్మరించి సిట్‌ దర్యాప్తు నిలిపివేసిందని పేర్కొన్నారు.
ఈ అంశం సిబిఐతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్‌ పవర్‌ ఉనుప్పటికీ హైకోర్టు దర్యాప్తునకు అంగీకరించలేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు చేయాలను తాజా ప్రభుత్వ నిర్ణయాల గురించి సుప్రీంకోర్టు గతంలో విచారించిందని తెలిపారు. రాజకీయ కక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు అధికారం లేదని హైకోర్టు అనడం సబబు కాదన్నారు.
రాజకీయ కక్షలు ఉనుప్పటికీ వాస్తవాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేయడం సమంజసమేనని జగన్నాధరావు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక వేళ రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై హైకోర్టుకు అనుమానం ఉంటే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా అని ఆయన చెప్పారు.
కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సులనే హైకోర్టు తప్పు పట్టిందని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చి విచారణ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు అనేది విస్తృత ప్రయోజనాల కోసమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 

కాగా ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తామని ప్రతివాది వర్ల రామయ్య తరపు న్యాయవాది సిద్దార్థ దవే తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘ఇది క్వశ్చన్‌ ఆఫ్‌ లా’కు సంబంధించిన అంశం. వాస్తవాలు కనిపెట్టే అథారిటీ మాది కాదు. మేమేమీ సిబిఐ, సిట్‌ కాదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వ అధికారాలు ఏమిటనే దానిపైనే విచారణ చేపడుతాం’ అని స్పష్టం చేసింది.


‘ప్రాముఖ్యమైన అంశం కావడంతో ప్రస్తుత ప్రభుత్వ అధికారాలు పరిశీలిస్తాం. నవంబరు 16న విచారిస్తాం’ అని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇదే కేసులో జత చేసిన ఒక అంశం ఉందని, అందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతివాది అని మరో న్యాయవాది ప్రస్తావించగా..ఆ అంశంపైనా తాము విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.