
గ్రానైట్ కంపెనీల్లో ఈడీ జరిపిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన కంపెనీలతోపాటు హైదరాబాద్, కరీంనగర్‌లోని సంస్థలు ఫెమా (విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనలను అతిక్రమించినట్లు ఈడీ తేల్చింది.
ఈ సంస్థలన్నీ చైనా, హాంకాంగ్‌తోపాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయల్టీకి మించిన పరిమాణంలో ముడి గ్రానైట్ ఎగుమతి చేసినట్లు పూర్తి ఆధారాలతో ఈడీ నిర్ధారించింది. లెక్కల్లోకి రాని మొత్తం ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది.
ఇక చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ సంస్థల యజమానుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలతో పనామా లీక్స్ విడుదల చేసిన జాబితాలో లివెన్ హ్యూ పేరు ఉండటం విశేషం
బుధ, గురు వారాల్లో జరిపిన వరుస సోదాలపై ఈడీ వర్గాలు శుక్రవారం ఓ అధికార ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణాలో శ్వేత గ్రానైట్, శ్వేత ఏజెన్సీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్స్‌లలో రెండురోజుల పాటు జరిపిన సోదాలలో కీలక ఆధారాలు లభించినట్టు ఈడీ వివరాలు వెల్లడించింది. ఈ సోదాల్లో రూ. 1.08 కోట్ల నగదు సీజ్ చేసినట్టు తెలిపారు.
ఈ గ్రానైట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పేరుతో బినామీ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామని చెబుతూ గ్రానైట్ దందాలో చైనా హవాలాపై ఆరా తీస్తున్నట్లు ఈడీ తెలిపింది. పనామా లీక్స్ వ్యవహారంలో లీ హువాన్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
సముద్ర, రైలు మార్గాల ద్వారా అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల గ్రానైట్ కంపెనీలు ఎగ్గొట్టినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ అధికారులు తెలిపారు. గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ 2013లో ఇచ్చిన నివేదిక ఆధారంగానే సోదాలు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది.
ఈ గ్రానైట్ సంస్థల పదేళ్ల ఎగుమతి డేటాను స్వాధీనం చేసుకున్నామని చెబుతూ చైనా సంస్థల నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా చేతి రుణాల రూపంలో ఇక్కడి సంస్థలకు డబ్బులు మళ్లినట్లు గుర్తించామని తెలిపారు. చైనా, హాంకాంగ్, సింగపూర్ తో పాటు మరికొన్ని దేశాలకు అక్రమంగా గ్రానైట్ ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.
ఎగుమతి పన్నులను ఎగవేస్తూ అడ్డదారిలో డబ్బు పొందినట్లు ఆధారాలు సేకరించినట్లు ప్రకటనలో తెలిపింది ఈడీ. శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్..పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిజా షిప్పింగ్ ఏజెన్సీస్.. హవాలా కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఈడీ పేర్కొంది.
తాడిచెర్ల మైన్ లో రూ. 20 వేల కోట్ల కుంభకోణం
ఇలా ఉండగా, తాడిచర్ల మైన్ ను ప్రైవేట్ కంపెనీ అయిన ఏఎమ్మాఆర్ కు కేసీఆర్ ఎందుకు కేటాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. తాడి చెర్ల మైన్ లో కేసీఆర్ కు కూడా వాటా ఉందని పేర్కొంటూ తాడిచెర్ల మైన్ లో రూ. 20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
దీనిపై సీపీఎం, సీపీఐ పార్టీలు కేసీఆర్ ను నిలదీయాలని కోరారు. సుప్రీంకోర్టు కోల్ ఇండియా సగటు ధర టన్నుకు రూ. 500 ఉంటే.. కేసీఆర్ ఏఎమ్మార్ కు రూ.2500లకు టన్ను చొప్పున కేటాయించారని పేర్కొన్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను