వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై చార్జిషీట్‌.. మోదీ హితవు

ఆంధ్ర ప్రదేశ్ లోని వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిలపై మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు చార్జిషీట్ లను రూపొందిస్తూ, వాటిని ప్రజలలోకి తీసుకెళ్లాలని రాష్ట్రంలోని బీజేపీకి నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్ధేశం చేశారు. రెండు రోజుల విశాఖపట్నం పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి  ‘ఐఎన్‌ఎస్‌ చోళ’ అతిథి గృహంలో రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడం గురించి చర్చించారు. ఒకప్పుడు గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో బిజెపి పరిస్థితి ఒకేవిధంగా ఉండెడిది, కానీ ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలలో పార్టీ అధికారంలో ఉండగా, ఏపీలో మాత్రం ఇంకా అదే  విధంగా ఉన్నదని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. అందుకు కారణాలను ఆత్మావలోకనం చేసుకోవాలని హితవు చెప్పారు. 
 
సమాఖ్య రాష్ట్ర స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో సన్నిహితంగా వ్యవహరిస్తోందని, కానీ దానిని రాష్ట్ర ప్రభుత్వంకు అందిస్తున్న రాజకీయ మద్దతుగా భావించి, ఇక్కడ పార్టీ ఎదుగుదలకు తిలోదకాలివ్వడం సబబు కాదని కూడా ఈ  సందర్భంగా స్పష్టం చేశారని తెలుస్తున్నది. 
 
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్‌ చెడగొట్టుకుంటున్నారని పేర్కొంటూ ఈ పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బిజెపి నాయకులకు తేల్చి చెప్పారు. వైసీపీ చేస్తున్న తప్పులను బహిర్గతం చేస్తూ, పల్లె పల్లెలో ప్రచారం చేయమని సూచిస్తూ ఆ పని ఇప్పటిదాకా ఎందుకు చేయడంలేదు? ఎవరు అడ్డుకుంటున్నారు?’ అని ప్రధాని మోదీ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. 
 విశాఖపట్నం మొత్తాన్ని కబ్జా చేశారని, వైసీపీ దోపిడీకి రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా పోతోందని స్థానిక నాయకులు ప్రధాని దృష్టికి తీసుకు రాగా అవినీతి విషయంలో ఎంతటి వారున్నా ఉపేక్షించబోనని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ ఆదేశించారు.
 
‘నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ విషయంలో ఇలా చేశారు.. ఇంగ్లండ్‌ వ్యవహారాల్లో అలా చేశారని క్షేత్రస్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీకి ఇచ్చిన ఎయిమ్స్‌, గ్రామాలకు ఇచ్చిన కొళాయి కనెక్షన్లు, రైతుల ఖాతాల్లో వేసిన పీఎం కిసాన్‌ సొమ్ము, హౌసింగ్‌ ద్వారా ఇచ్చిన ఇళ్ల గురించి చెబితే ఫలితం ఉంటుంది’ అంటూ ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం పది విషయాల్లో విఫలమైతే, కనీసం నాలుగింటినైనా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం కృషిని తెలియచెప్పడంలో, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎటువంటి సంశయం పెట్టుకొవద్దని హితవు చెప్పారు. 
 
మహిళా మోర్చా తరఫున వీధుల్లోకి వెళ్లి మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల ఇళ్ల నుంచి వాళ్ల పిల్లల దుస్తులు సేకరించి అంగన్‌వాడీ సెంటర్లలో ఇస్తే బీజేపీ అంటే రాజకీయం, ఓట్లు మాత్రమే కాదు.. సేవ కూడా అనే భావన ప్రజల్లో పెరుగుతుందని ప్రధాని చెప్పారు. యువతను ఆకట్టుకునేలా కబడ్డీ, వాలీబాల్‌ వంటి క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. 
తొలుత తమిళనాడు నుండి విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు  స్వాగతం పలికారు.