ఏపీలో కక్ష సాధింపు రాజకేయాలపై ప్రధానికి పవన్ ఫిర్యాదు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు రాజకీయాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. పార్టీ సహచరుడు నాదెండ్ల మనోహర్ తో కలసి శుక్రవారం రాత్రి విశాఖపట్నంలో ప్రధానిని కలసిన ఆయన రాష్ట్రంలోని పరిస్థితులపై అరగంటకు పైగా సమాలోచనలు జరిపారు. 
 
ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలుసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీకి త్వరలో మంచి రోజులు వస్తాయని సమావేశం అనంతరం ఆశాభావం వ్యక్తం చేశారు. `మనం ఇక తరచూ కలుసు ఉందాం’ అని ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్ని తనకు తెలుసని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. `ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ధిక క్రమశిక్షణ లోపిస్తుంది. హింసాయుత దాడులు జరుగుతున్నాయి’ అంటూ పవన్ వివరించినట్లు తెలుస్తున్నది. 
 
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నుండి తాజాగా ఇప్పటంలో జరిగిన దాడి వరకు పలు సంఘటనల గురించి ప్రధానికి వివరించినట్లు చెబుతున్నారు. తాజాగా తాను విశాఖలో పర్యటించిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో పెచ్చుపెరుగుతున్న భూకబ్జాలు,  దౌర్జన్యాలను ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారు. 
 
కేంద్రం ఇస్తున్న నిధులను సహితం రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని జనసేన అధినేత పేర్కొన్నారు.  2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధానిని కలిసిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. 
 
8 ఏళ్ల తర్వాత ఇప్పుడే కలవడం. ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన సమావేశం అని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. “ఈ సమావేశం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. ప్రధాని ఆకాంక్ష కూడా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు తెలియజేశానని చెబుతూ ‘భవిష్యత్తులో ఇది ఏపీకి మంచి రోజులు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.