భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా విశాఖ

విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ రైల్వేలు, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని గుర్తు చేశారు. 

 విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేశారు.  ఈ సందర్భంగా  జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లతో  ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా ఏపీ ప్రజలు ప్రత్యేకతను కనబరుస్తున్నారని,  ఏపీ ప్రజల ఉన్నత వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలుపుతోందని ప్రధాని చెప్పారు.  తెలుగు ప్రజలు అందరి బాగుకోసం పాటుపడుతారని ప్రధాని కొనియాడారు.

మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని పేర్కొంటూ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ప్రతి నగరానికి అవసరమని, విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. పురాతన భారతదేశంలో విశాఖపట్నం ఒక ముఖ్యమైన ఓడరేవుగా వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా మరియు రోమ్‌ లకు వాణిజ్య మార్గంలో భాగమని, నేటికీ ఇది భారత దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచి ఉందని ఆయన పేర్కొన్నారు.

నేడు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో తామెప్పుడూ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.

 ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే మరోవైపు ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతోనే ఏపీ తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని చెప్పారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పథం ఇస్తోందని ప్రధాని గుర్తు చేసారు. 

ఏపీ వాసులు స్నేహపూర్వకంగా ఉంటారని..టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా తమ ప్రత్యేకతను కనబరుస్తున్నారని ప్రశంసించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు తనను ఎప్పుడు కలిసినా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తు చేశారు. 

“అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాధించాలనే లక్ష్యంతో, ఈ అమృత్ కాలంలో, దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. అభివృద్ధి మార్గం బహుముఖీయమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ, ఇది సాధారణ పౌరుని అవసరాలపై దృష్టి సారిస్తుందని, అధునాతన మౌలిక సదుపాయాల కోసం ప్రణాలికను అందజేస్తుందని తెలియజేశారు. సమ్మిళిత వృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు. 

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెబుతూ వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మోదీ వెల్లడించారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు, పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. సన్‌రైజ్ సెక్టార్ ఆలోచన కారణంగా యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. సముద్ర వ్యాపారాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.