భారత్‌తో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతంకు అమెరికా

భారత్‌తో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి వుందని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య సహకారం స్థాయిని పెంచుకోవడానికి కూడా తాము నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. 
 
అమెరికా-భారత్‌ ఆర్థిక భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ  ”ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ వార్షిక సమావేశాలనేవి ఒక అవకాశం” అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఈ వేదికపై సహకారం వల్ల ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందడం, సుస్థిరత సాధించడమే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంత వ్యాప్తంగా ఆర్థిక ప్రగతికి మద్దతుగా నిలవగలమని ఆమె పేర్కొన్నారు.
 
 ”ఈనాడు మనం అనేక రకాలైన సవాళ్ళను, ఆర్థిక పరమైన ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాం. కరోనా ప్రభావం నుండి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇంధన, ఆహార ధరలు అనూహ్యమైన రీతిలో పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.” అని యెలెన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
 
 అయితే, ఈ తరహా సవాళ్ళు అమెరికా, భారత్‌ల మధ్య నెలకొన్నటువంటి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయని ఆమె స్పష్టం చేశారు. సహకారం ఆవశ్యకతను, ఎలాంటి అరమరికలు లేని స్పష్టమైన కమ్యూనికేషన్‌ను ప్రదర్శించడం ద్వారా ఈ సవాళ్ళను ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. 
 
మన పటిష్టమైన వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు ఇవన్నీ కలిసి ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ఈ భాగస్వామ్యంలో కీలకమైన భాగంగా రూపొందిస్తాయని చెప్పారు. 
 
అంతర్జాతీయ సవాళ్ళను మరింత సమన్వయ రీతిలో ఎదుర్కొనడానికి, బహుళవాదాన్ని బలోపేతం చేయడానికి అమెరికాతో సన్నిహిత సహకారాన్ని భారత్‌ కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. విశ్వసనీయమైన భాగస్వామిగా అమెరికాకు విలువిస్తుందని ఆమె తెలిపారు.
 
 క్వాడ్‌, ఇండో పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఇవన్నీ మన సహకారాన్ని మరింత విస్తరించాయని ఆమె పేర్కొన్నారు. ఈ భాగస్వామ్య సదస్సుకు ముందుగా యెలెన్‌, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై ఇరువురు చర్చించారు.