చైనాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా

చైనాలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. ఆ దేశంలో తాజాగా పది వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు వైరస్‌ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు విధించి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘ్వాంగ్‌జౌవ్‌, ఛాంగ్‌క్వింగ్‌ నగరాల్లో.. దాదాపు 50 లక్షల మంది కఠినా లాక్‌డౌన్‌ ఆంక్షల మధ్య ఉన్నారు.  వైరస్‌ కట్టడికి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నా ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం అక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది.

ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నాకరోనా అదుపులోకి రాకపోవడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. రాజధాని బీజింగ్‌లో ఒక్కరోజే 118 కొత్త కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న రెండు కోట్లకుపైగా ప్రజలకి రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. బీజింగ్ లో సిటీ పార్కులను మూసివేశారు. అలాగే పలు కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. పాఠశాలలన్నీ ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. రెస్టారెంట్స్‌, దుకాణాలను మూయించిన అధికారులు అందులో పనిచేస్తున్న వారిని క్వారంటైన్‌కు తరలించారు.

గాంగ్‌ఝౌ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ కొద్దిరోజులుగా రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న హైఝులో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో ఆదివారం వరకు కఠిన లాక్‌డౌన్ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కరోనా కట్టడికి విధించిన కఠిన ఆంక్షలను తట్టుకోలేని చైనా ప్రజలు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆంక్షలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరాశపై చైనా అధికారులు స్పందిస్తూ కేసులు భారీగా ఉన్న నగరాలను మినహాయించి మిగతా ప్రాంతాల్లోని ప్రజలను నిర్బంధం నుంచి విడిచిపెడతామని హామీ ఇచ్చారు.