ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలతో జరిపే సమాలోచనలలో   చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చింపనున్నారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందు పాతరల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు చాలా మంది గాయపడుతున్నారు.
 మైన్‌‌ఫీల్డ్స్ వల్ల కొన్ని దేశాల్లోని ఎక్కువ భాగం ప్రవేశానికి అవకాశం లేకుండా మిగిలిపోతోంది. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సమావేశాలు ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు జరుగుతాయి. మైన్‌ఫీల్డ్స్, చెదురుమదురుగా ఉండే మందుపాతరల వల్ల చాలా దేశాల్లో అనేక మంది మరణిస్తుండటం, గాయపడుతుండటం జరుగుతోంది.
 ముఖ్యంగా కాంబోడియా, లావోస్, వియత్నాం వంటి దేశాలు వీటివల్ల ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ మందుపాతరలను తొలగించేందుకు భారతీయ సిబ్బందిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి ఇప్పటికే కొన్ని ఆసియాన్ దేశాలు భారత దేశంతో చర్చలు జరిపాయి.
డీమైనింగ్ కార్యకలాపాల నిర్వహణకు తగిన సత్తా భారత దేశానికి ఉండటంతోపాటు, ఇతర దేశాలకు సహకరించే విషయంలో కూడా ఆసక్తి చూపుతోంది. కాంబోడియాలో అంతర్యుద్ధం 1980వ దశకం చివర్లో ముగిసింది.  కానీ యుద్ధం సమయంలో పెట్టిన యాంటీ పర్సనల్ మైన్స్ ఇప్పటికీ ఉన్నాయి.  వాటి మీద కాలు మోపిన వారు ప్రాణాలను కోల్పోవడం కానీ, శరీర అవయవాలను కోల్పోవడం కానీ జరుగుతోంది. వియత్నాంలో యుద్ధాలు 1950వ దశకంలో ప్రారంభమయ్యాయి.
1979-80లో చైనా దాడిని తిప్పికొట్టే వరకు కొనసాగాయి. అంతకుముందు ఫ్రెంచ్, అమెరికాలతో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం లావోస్‌కు కూడా విస్తరించింది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల సంస్థలు డీమైనింగ్ ఆపరేషన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నాయి.  చౌక ధరకు ఈ కార్యకలాపాలను నిర్వహించగలమనే నమ్మకం భారత దేశానికి ఉంది. రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో ఈ అంశం చర్చకు వస్తుందని తెలుస్తోంది.
మరోవంక, చైనా దురాక్రమణ వైఖరి వల్ల ఇబ్బందులు పడుతున్నామనే భావన ఆసియాన్ దేశాలకు ఉంది.  ఇప్పటికే ఫిలిప్పైన్స్, మరికొన్ని దేశాలకు మన దేశం బ్రహ్మోస్ మిసైల్‌ను విక్రయించింది. ఈ నేపథ్యంలో రక్షణ సంబంధాలు మరింత బలోపేతమవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.