`హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం

`హిందూ’ పదంపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే అర్థం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

పర్షియన్ పదమైన హిందూతో భారత్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. బెళగావి జిల్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో  మాజీ మంత్రి సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి మాట్లాడుతూ  నిజానికి హిందూ అనే పదానికి భారతదేశానికి సంబంధమే లేదని  చెప్పారు. హిందూ అని ఎలా ప్రకటించుకుంటారని ఆయన ప్రశ్నించడం దుమారం రేపింది.

ఆ పదానికి మూలాలు భారతదేశంలో లేవని చెప్పారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్ నుంచి వచ్చిందని తెలిపారు. ‘హిందూ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? అది మనదేనా?’ అని ప్రశ్నించారు. ‘ఇది పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినది. హిందూ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏమిటి? మీరు దానిని ఎలా అంగీకరిస్తారు? దీనిపై చర్చ జరుగాలి’ అని స్పష్టం చేశారు.

అంతేగాక ‘హిందూ అనే పదానికి అర్థం తెలిస్తే మీరు సిగ్గుపడతారు. దీని అర్థం అసభ్యకరం’ అని జార్కిహోళి వ్యాఖ్యానించారు. హిందూ పదం ఎక్కడ నుంచి వచ్చిందో అన్నది వికీపీడియా ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు హిందూ పదంపై జార్కిహోళి మాట్లాడిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై మండిపడింది. ఇది హిందువులను అవమానించడం, రెచ్చగొట్టడం అని ఆ పార్టీ ఆరోపించింది.

ఓ పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తుండగానే సతీశ్ జార్కిహోలి హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ సబబని భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ ప్రశ్నించారు.  తొలుత శివరాజ్‌పాటిల్, నేడు సతీశ్ జార్కిహోలి హిందువులను అవమానిస్తున్నారంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు. హిందూ ధర్మాన్ని అవమానించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌పాటిల్ ఇటీవలే భగవద్గీతలో కూడా జిహాద్ ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా సతీశ్ జార్కిహోలి హిందు అంటే అత్యంత మురికి అని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. సతీశ్ జార్కిహోలి వ్యాఖ్యలపై హైందవ సంస్థలు, వాటి ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు.

తమ నాయకుడి ప్రకటన పెను వివాదానికి దారితీయడంతో, కాంగ్రెస్ దిద్దుబాటు  చర్యకు దిగింది. హిందూయిజం ఒక జీవన విధానం,  నాగరికత వాస్తవమని పేర్కొంది. “సతీష్ జార్కిహోళికి ప్రకటన చాలా దురదృష్టకరం.  మేము దానిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. హిందూ మతం ఒక జీవన విధానం,  నాగరికత వాస్తవికత. ప్రతి మతం,  విశ్వాసాన్ని గౌరవించేలా కాంగ్రెస్ మన దేశాన్ని నిర్మించింది. ఇది సారాంశం. భారతదేశం” అని కర్ణాటక ఇంచార్జ్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.

జార్కిహోళి వ్యాఖ్యలను  ఖండిస్తూ, ప్రజల మనోభావాలు, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ గౌరవించాలని  బీజేపీ  హితవు చెప్పింది.  “వారు గందరగోళం సృష్టించకూడదు. సెంటిమెంట్‌లను గౌరవించండి, విమర్శించే బదులు సంస్కృతిని గౌరవించండి. అనవసరమైన వివాదాలు సృష్టించవద్దు, ఇది సమాజాల ప్రయోజనాలకు మంచిది కాదు” అని కర్నాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి అశ్వత్నారాయన్ హెచ్చరించారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సతీశ్ జార్కిహోలి హిందువులపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మరింత చేటు తెస్తాయని రాజకీయ పరిశీలకులంటున్నారు.