ట్విట్టర్‌లో ఉద్యోగుల కోతను ఖండించిన కేంద్రం

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల కోతపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది.  ఉద్యోగులకు కొంత సమయం ఇచ్చి ఉండాల్సిందని తెలిపింది. ‘భారత్‌లో ట్విట్టర్‌ తమ ఉద్యోగుల్ని తొలగించడాన్ని మేం ఖండిస్తున్నాం. మరో ఉద్యోగంలోకి మారేందుకు వారికి తగినంత సమయం ఇచ్చి ఉండాల్సింది’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌  సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు. ఇకపై వారంతా వీధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని మెయిల్స్‌ పంపించారు.

ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్విట్టర్‌ ఆఫీసులను మూసే ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే భారత్‌లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్‌ బై చెప్పారు. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్‌.. ఇంజినీరింగ్‌, సేల్స్‌ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు.

 భారతదేశం ఇతర చోట్ల ఉన్న ట్విట్టర్ ఉద్యోగులు ఇంతకాలం దీనితో అత్యంత అనుబంధం పెంచుకుని వస్తున్న వారు ఇప్పుడు ఇంటికి వెళ్లవచ్చుననే మస్క్ ఆదేశాలతో కంగుతిన్నారు. ఏదో మార్పు జరుగుతుందని తాము భావించామని అయితే ఈ విధంగా తమను ఇంతత్వరగా తీసివేస్తారని తాము భావించలేదని పలువురు ఉద్యోగులు తెలిపారు. కొందరు తమ ఆవేదనను గుడ్‌బైను ట్విట్టర్‌లోనే చివరి సందేశంగా వెలువరించారు.