ద‌క్షిణాదిలో తొలి వందే భార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్

ద‌క్షిణాదిలో తొలి వందేభార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభ‌మైంది. చెన్నై-మైసూర్ వందేభార‌త్ ట్ర‌య‌ల్ ర‌న్ చెన్నైలోని ఎంజీ రామ‌చంద్ర‌న్ సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్‌లో సోమ‌వారం ప్రారంభ‌మైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ద‌క్షిణాదిన తొలిసారిగా న‌వంబ‌ర్ 11న ప‌ట్టాలెక్క‌నుంది.

దేశంలో 5వ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల11వతేదీన పచ్చజెండా ఊపి ప్రయాణికుల కోసం ప్రారంభించనున్నారు.

ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువ‌ల్ ప్యాసింజ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్ క‌లిగిఉంటాయి. వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై, క‌మ్‌ఫ‌ర్ట్‌బుల్ సీటింగ్ వంటి సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. 

ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా రొటేటింగ్ ఛైర్స్ అమ‌ర్చారు. ఈ ట్రైన్ చెన్నై సెంట్ర‌ల్ నుంచి బ‌య‌లుదేరి బెంగ‌ళూర్ సిటీ జంక్ష‌న్ మీదుగా తుది గ‌మ్య‌స్ధానం మైసూర్‌కు చేరుకుంటుంది. మొత్తం 497 కిలోమీట‌ర్ల దూరాన్ని ఈ ట్రైన్ 6 గంట‌ల 40 నిమిషాల్లో చేరుకుంటుంది.

న్యూఢిల్లీ -కాన్పూర్- అలహాబాద్-వరణాసి మార్గంలో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు కేంద్రం జాతికి అంకితం చేస్తోంది. 

దేశంలో నలుమూలలను కలిపేలా 75 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతామని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై ప్రకటించారు. స్పీడ్, సేఫ్టీ, సర్వీసులతో కూడిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ఉత్పత్తి యూనిట్ తయారు చేసింది.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని ఇస్తున్నాయి. ఈ రైళ్లతో ప్రయాణ కాలం సగానికి పైగా తగ్గింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు. వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.