ఏపీలో చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు  నందిగామలో పర్యటిస్తుండగా శుక్ర‌వారం సాయంత్రం నందిగామ‌లో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి జ‌రిగింది. కొంత‌మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్లు రువ్వారు.

ఈ సందర్భంగా చంద్ర‌బాబు వెనుక నుంచున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ మధు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాన్వాయ్‌పై రాళ్లు ప‌డడంతో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌కు గాయాల‌య్యాయి. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా నిలివేశారు.  చంద్రబాబుకు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆ సెక్యూరిటీ బృందానికి నేతృత్వం వహిస్తున్న మధుపైనే రాయి పడటం గమనార్హం. తనకు దెబ్బ తగలి రక్తం కారుతుండటంతో విషయాన్ని ఆయన చంద్రబాబుకు తెలిపారు. మధుకు గాయం కావడం, ఆయన తల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను చూసిన వెంటనే కోపోద్రిక్తుడైన చంద్రబాబు… నాని చేతిలోని మైకును తీసుకుని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. 

తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. త‌మ‌కు సెక్యూరిటీ క్ప‌లించ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, పోలీసులు పట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు.

అంతకుముందు చంద్రబాబు రోడ్‌షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్‌షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు. రోడ్‌షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. 

చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు.