క్షీపణుల నుండి దేశాన్ని కాపాడే శక్తి మరింత పెరిగింది 

శత్రు దేశాల లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ నుంచి దేశాన్ని కాపాడే సత్తా మరింత పెరిగిందని, మన దేశంవైపు కన్నెత్తి చూసే శత్రువులను దీటుగా అడ్డుకునే సత్తా మరింత పెరిగిందని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్  చెప్పారు. 

ఏడీ-1 ఇంటర్‌సెప్ట్ మిసైల్ తొలి పరీక్ష బుధవారం విజయవంతమవడంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు పెరిగాయని పేర్కొన్నారు. డాక్టర్  కామత్  ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే ఏ క్షిపణినైనా అడ్డుకునే సత్తా ఫేజ్-2 బీఎండీ (బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్) ఏడీ-1కు ఉందని చెప్పారు.

సుదూరం నుంచి శత్రువులు మనల్ని లక్ష్యంగా చేసుకుంటే, అడ్డుకునే సత్తా మనకు ఇప్పుడు ఉందని తెలిపారు. బాలిస్టిక్ మిసైల్స్‌ను తిప్పికొట్టే మన సత్తాలో ఇది చెప్పుకోదగ్గ ప్రధాన సామర్థ్యమని స్పష్టం చేశారు.  శత్రువుల మిసైల్‌ను మన రాడార్లు గుర్తిస్తే, దాని జాడను ఏడీ-1 గుర్తించగలదని, మన రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేయగలదని, ఆ మిసైల్‌ను అడ్డుకోగలుగుతుందని చెప్పారు.

ఇది ప్రధానంగా ఎండో అట్మాస్ఫియరిక్ (భూమి ఉపరితలం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తులో) అని, అయితే ఇది లో ఎక్సో-అట్మాస్ఫియరిక్ రీజియన్ (మేఘాలు, వర్షం, మంచు ఉండే ప్రాంతం)లో కూడా పని చేస్తుందని తెలిపారు. హై ఎక్సో-అట్మాస్ఫియరిక్ రీజియన్ (భూ వాతావరణంలో అత్యంత ఎత్తయిన ప్రాంతం, దీనిలో గాలి దాదాపు ఉండదు) కోసం కూడా దీనిని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యవస్థలను కార్యకలాపాలకు సిద్ధం చేస్తే, దేశానికి బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. బాలిస్టిక్ మిసైల్స్ నుంచి దేశాన్ని కాపాడవచ్చునని తెలిపారు. 99.8 శాతం కచ్చితత్వంతో ఈ వ్యవస్థ పని చేస్తుందన్నారు. శత్రు దేశాల విమానాలను అడ్డుకునేందుకు కూడా ఏడీ-1 ఉపయోగపడుతుందని చెప్పారు.