అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు 

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. .ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లా డుతూ .అవినీతి పరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని చెప్పారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక రక్షణ కూడా లభించకూడదని పేర్కొన్నారు.

అవినీతి అన్నది ఓ దెయ్యం. దానికి దూరంగా ఉండాలని చెబుతూ  దాసీనత, ఒత్తిళ్లు తయారు చేసిన వ్యవస్థను మార్చడానికి ఎనిమిదేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నామని  ప్రధాని తెలిపారు. చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, అభియోగాలు రుజువై జైలుకు వెళ్లొచ్చినా కానీ కీర్తింపబడుతున్నారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 

భారత సమాాజానికి ఇదేమీ మంచి పరిస్థితి కాదని తెలిపారు. నేడు కూడా అవినీతిపరులను సమర్థిస్తూ కొందరు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సమాజం పట్ల వారికున్న బాధ్యత, కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 

అవినీతి..అవినీతి పరులకు వ్యతిరేకంగా వ్యవహరించే విషయంలో ఏజెన్సీలు..అధికారులు భయపడాల్సిన అవసరం కానీ, రక్షణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని  ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి పరులు ఎంతటి శక్తిమంతులైనా కానీ, వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోకుండా, దృఢంగా వ్యవహరించాలని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని సూచించారు. అవినీతి పరులు తప్పించుకోకుండా చూడాలని కోరారు.

 ‘‘మీ వంటి సంస్థల బాధ్యత ఇది. ఏ అవినీతిపరునికీ రాజకీయ లేదా సాంఘిక మద్దతు లభించకూడదు, ప్రతి అవినీతిపరుడినీ సమాజం బోనులో నిలబెట్టాలి. ఇటువంటి వాతావరణాన్ని సృష్టించడం అవసరం’’ అని ప్రధాని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై క్రమశిక్షణ చర్యలను సత్వరం ఓ కొలిక్కి తేవలసిన అవసరం ఉందని తెలిపారు.