పాక్ ప్రధాని, మరో ఇద్దరు దాడికి బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్ 

పాకిస్థాన్‌ ప్రస్తుత ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్థాన్‌ తెహ్రీక్‌ -ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ సీనియర్‌ నేత అసద్‌ ఉమర్‌ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు అంతర్గత మంత్రి సనావుల్లా, మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నజీర్‌ దాడికి బాధ్యులని పేర్కొన్నారు. 
 
షరీఫ్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాత్రి తూర్పు పాకిస్థాన్‌లోని వజీరాబాద్‌ అల్లావాలా చౌక్‌లో పాదయాత్ర చేపడుతున్న సమయంలో ప్రసంగిస్తుండగా కంటైనర్‌ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.  ఈ ఘటనలో ఇమ్రాన్‌ రెండు కాళ్లకు బుల్లెట్‌ తగిలి గాయమైంది. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ప్రధాని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫైజల సుల్తాన్‌ పేర్కొన్నారు.
 
అయితే ఆయన కాలు ఎముకలో చిన్న బుల్లెట్‌ ముక్క ఉన్నట్లు ఎక్స్‌రేలో బయటపడిందని చెప్పారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు కాగా, ఒకరు మరణించినట్లు పంజాబ్‌ ప్రావిన్స్‌ పోలీసులు తెలిపారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.  
 
కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలను సనావుల్లా తోసిపుచ్చారు. నిజనిర్థారణకు సిద్ధమని, ఏవిధమైన దర్యాప్తుకైనా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సీనియర్‌ అధికారులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందాన్ని పంజాబ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
అయితే, కాల్పులపై తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ తనకు దేవుడు పునర్జన్మ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారన్న ఆయన తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని వెల్లడించారు. తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని వివరించారు.
ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం జరిగిన ఘటనపై భారత్‌ స్పందించింది. పాక్‌లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ‘ఇప్పుడే ఓ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఓ కన్నేసి ఉంచాం. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం’ అని పేర్కొన్నారు.