ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు.. ప్రధాని మోడీ అభినందనలు

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా బెంజిమన్ నెతన్యాహు ఎన్నికయ్యారు. దీంతో మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమి 64 స్థానాలను సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా నెతన్యాహు రికార్డు సృష్టించారు. 

ఇజ్రాయెల్‌ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ఇందులో 62 సీట్లు గెలుపొందిన పార్టీయే అధికారం చేపట్టనుంది.  దీంతో 73 ఏండ్ల నెతన్యాహు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. ఆయన నాయకత్వంలోని లికడ్‌ పార్టీ సొతంగా 32 స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో గత నాలుగేండ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి కావడం విశేషం.

ఐదోసారి ఇజ్రాయెల్ ప్రధాని పదవిని అధిరోహించబోతున్న బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘‘కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్. మీ విజయం భారతదేశం-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడంతో పాటు మన ఉమ్మడి ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తుందని నేను ఎదురుచూస్తున్నాను ’’ అని ట్వీట్ చేశారు.

కాగా, ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధానమంత్రి యైర్ లాపిడ్ కూడా తన ఓటమిని అంగీకరించారు. విజయం సాధించిన తన ప్రత్యర్థి నెతన్యాహును అభినందించారు. వ్యవస్థీకృత అధికార మార్పిడిని సిద్ధం చేయాలని తన మొత్తం కార్యాలయాన్ని ఆదేశించారు