ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు..స్వల్పంగా గాయాలు 

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రమాదం తప్పింది. ఆయన గురువారం నిర్వహించిన ర్యాలీలో దుండగులు కాల్పులు జరిపారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లోని జాఫర్‌ అలీ ఖాన్‌ చౌక్‌లో జరిగిన ర్యాలీలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలైనా క్షేమంగా ప్రాణాలతో బయట పడ్డారని తెలుస్తున్నది. ఇమ్రాన్‌ఖాన్‌ కాలికి గాయమైంది. దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది.

ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ఆయన కార్యదర్శి రషీద్‌, సింధు మాజీ గవర్నర్‌ ఇమ్రాన్‌ ఇస్మాయిల్‌, పీటీఐ నేత ఫైసల్‌ జావేద్‌, తదితరులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప దవాఖానలకు తరలించారు.

కాల్పులు జరిగిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ ను ఘటనా స్థలంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి తరలించినట్లు వీడియో దృశ్యాలు ధృవీకరిస్తున్నాయి. అంతకుముందు ఆయన ఓపెన్‌ టాప్‌ వాహనంలో పర్యటిస్తున్నారు. దుండ‌గుడు స‌మీపం నుంచే ఏకే-47 గ‌న్‌తో కాల్చిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ కాలులోకి మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగిన‌ట్లు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు. ఇమ్రాన్‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు తాను ప‌క్క‌నే ఉన్న‌ట్లు ఇస్మాయిల్ చెప్పారు. గాయ‌ప‌డ్డ ఇమ్రాన్‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. వ‌జీరాబాద్ లాంగ్ మార్చ్ స‌మ‌యంలో ఇమ్రాన్‌పై దాడి జ‌రిగిన‌ట్లు పీటీఐ నేత ఫ‌వ‌ద్ చౌద‌రీ తెలిపారు.