టీ20 వరల్డ్ కప్ లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ

టీ20 వరల్డ్ కప్ లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధిస్తున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పిన కోహ్లీ బుధవారం బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

అడిలైడ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన వ్యక్తిగత స్కోర్ 16 వద్ద ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (1016) పేరిట ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డ్ ను కోహ్లీ అధిగమించాడు. 

2014 టీ20 వరల్డ్ కప్ లో 319 పరుగులు సాధించి కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.  అదేవిధంగా 2016 టీ20 వరల్డ్ కప్ లో 273 పరుగులు చేసి రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ  64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి,  ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అయ్యాడు.  

ఈ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడగా, విరాట్ 82 పరుగుల వీరోచిత బ్యాటింగ్ తో థ్రిల్లింగ్ విక్టరీ వరించింది. తర్వాత నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ 62 రన్స్ చేశాడు.

కాగా, భారత యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20ల్లో తనకు తిరుగులేదని చాటిచెప్పాడు. ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

సూపర్‌ఫామ్‌ మీదున్న సూర్య ప్రస్తుతం 863 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు.విరాట్‌ కోహ్లీ తర్వాత అగ్రస్థానం అధిష్టించిన రెండో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ క్రికెటర్‌ రిజ్వాన్‌ (842)ను రెండో ర్యాంక్‌కు పరిమితం చేస్తూ టాప్‌ ర్యాంక్‌లోకి దూసుకెళ్లాడు.

 బంగ్లాదేశ్ పై ఉత్కంఠ పోరులో విజయం 

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.  వర్షం వల్ల 16 ఓవర్లకు గానూ  151 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్‌ 145  స్కోరుకు మాత్రమే పరిమితమైంది. ఈ విజయంతో  టీమిండియా సెమీస్ బెర్త్ ను నిర్ధారించుకోంది. 

మొత్తం మ్యాచ్ ని వర్షం మలుపు తిప్పింది. 185  పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన  బంగ్లాకు లిటన్ దాస్ (60), షాంటో (21) అదిరిపోయే అరంభాన్ని ఇచ్చారు.  దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీకి తరలించారు.  ఏడు  ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఆ జట్టు 66 పరుగులు చేసింది. ఓ క్రమంలో ఈజీగానే బంగ్లా టార్గెట్ ను ఫినిష్  చేస్తుందని అనిపించింది.

అయితే వర్షం తర్వాత మ్యాచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వర్షం తర్వాత బంగ్లా టార్గెట్ 9 ఓవర్లలో 85 పరుగులు కావడంతో  ఆ జట్టు తొందరగానే  ఓపెనర్లిద్దిరిని కోల్పోయింది.  లిటన్ దాస్ (60) రనౌట్ కాగా షాంటో (21) షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాసేపటికే అసిఫ్‌ (3),  షకిబ్ (13), యాసిర్‌ (1) , మొసాడెక్ (6) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో మ్యాచ్ టీమిండియా చేతిలోకి వచ్చేసింది.  భారత్ తరుపున  అర్ష్ దీప్, పాండ్యా చేరో రెండు వికెట్లు తీశారు.