నన్ను చంపేందుకు కుట్ర జరగుతోంది… ఈటెల 

తనను చంపేందుకు కుట్ర జరగుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. పక్కా పథకం ప్రకారమే తనపై మునుగోడులోని పలివెలలో దాడి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలో తానూ ఓ సభ్యుడినన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని ఆయన హితవు  చెప్పారు. 

 హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచి ఏడాది పూర్తయి సందర్భంగా మాట్లాడుతూ  తనపై ఈగ వాలినా బీజేపీ చూస్తూ ఊరుకోదని ఈటెల హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనియరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఈట‌ల‌ ఆరోపించారు.

కేంద్రమంత్రికే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం కేసీఆర్ హాయాంలో లేకుండా పోయిందని విమర్శించారు. తన భార్య ప్రచారానికి వెళితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ దాడులను చూస్తూ ఊరుకోబోమని,దెబ్బకు దెబ్బ ఉంటుందని హెచ్చరించారు. 

 హుజూరాబాద్‌లో అవసరం లేకున్నా అనేక మందికి గన్‌ లైసెన్సులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆడిస్తే ఆడే తోలు బొమ్మలకు, చెంచాలకు బీజేపీ భయపడదని స్ష్టం చేశా రు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమితో తనపై సీఎం కేసీఆర్‌ పగపట్టారని, మునుగోడులో డబ్బు, మ‌ద్యంని ఏరులు పారించార‌ని ఆయన  మండిప‌డ్డారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధర్మం, దౌర్జన్యం, దుర్మార్గం మీద న్యాయం, ధర్మం గెలిచిందని ఈటల రాజేందర్ తెలిపారు. డబ్బులు సంచులు, అధికారం, మద్యం ప్రజల విశ్వాసం ముందు చెల్లవని హుజురాబాద్ ప్రజలు తేల్చి చెప్పారని పేర్కొన్నారు. అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గాన్ని బొంద పెట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటదని చాటి చెప్పారని వివరించారు.

దేశంలో ఖరీదైన ఎన్నికలు ఎక్కడ జరుగుతాయంటే తెలంగాణలో జరుగుతాయన్న పరిస్ధితి కేసీఆర్ తీసుకొచ్చారని  రాజేందర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో  ఎప్పుడూ లేని రాజకీయ పరిస్ధితులు ఏర్పడ్డాయని చెప్పారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సొంత ఆలోచనలు ఉండొద్దని..బానిసలుగా మార్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో అటుకులు బుక్కి…ఉపాసం ఉండి ఎన్నికల్లో గెలిచామని చెప్పే కేసీఆర్..ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని మండిపడ్డారు.