అర్థరాత్రి మునుగోడుకు బండి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bandi Sanjay,

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మునుగోడుకు బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు మూసారాం చౌరస్తా వద్ద ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు పోలీసుల తీరును నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

మూసారాంబాగ్ వద్ద పోలీసు వలయం దాటుకుని వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్ ను వనస్థలిపురంలో అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద కాన్వాయ్ ను అడ్డుకున్నారు. హైవేపై బారికేడ్లు, పోలీస్ వెహికిల్స్ ను అడ్డుపెట్టి బండి సంజయ్ మునుగోడుకు వెళ్లకుండా నిలువరించారు.

దీంతో బండితో పాటు బీజేపీ కార్యకర్తలు హైవేపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అర్థరాత్రి 1:45 గంటల బండి సంజయ్తో పాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గురువారం ఉదయమే ఆయనను తీసుకు వచ్చి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వదిలారు.

అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ పోలీస్ స్టేషన్ నుండి ఉదయమే పోలీసులు సంజయ్ ను తరలిస్తుండడంతో ఎక్కడికో తెలియని ప్రదేశానికి తీసుకు వెడుతున్నారన్న అనుమానంతో బిజెపి కార్యకర్తలు పోలీస్ కాన్వాయ్ ను వెంబడించారు.

 ఇలా ఉండగా, ప్రచార గడువు ముగిసినా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల రూల్స్‌‌కు విరుద్ధంగా మునుగోడులోనే మకాం వేశారని, వాళ్లను అక్కడి నుంచి పంపించేయాలని ఈసీ అధికారులను  సంజయ్ అంతకు ముందు డిమాండ్ చేశారు. ‘‘మేం నిబంధనల మేరకు ప్రచారం గడువు ముగియగానే అక్కడి నుంచి వచ్చాం. కాని ఇతర ప్రాంతాలకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు.  మంగళవారం రాత్రంతా డబ్బులు పంచారు. బుధవారం కూడా అక్కడే ఉంటూ డబ్బులు పంచారు’’ అని ఆరోపించారు. 

మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తుందా లేదా తేల్చుకోవాలని హితవు చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లను అక్కడి నుంచి వెంటనే వెళ్లగొట్టాలని, లేదంటే తమ పార్టీ కార్యకర్తలందరినీ మునుగోడుకు తరలిరావాలని పిలుపునిచ్చే పరిస్థితి కల్పించవద్దని స్పష్టం చేశారు. 

‘‘మేం సంయమనం పాటిస్తున్నాం. బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉందని, తమ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసి టీఆర్ఎస్ ఏదో రకంగా అశాంతికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నది” అని ఆరోపించారు.