రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి !

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటంతో.. వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంద‌కొడిగా సాగిన పోలింగ్.. ఆ త‌ర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.55 శాతం పోలింగ్ న‌మోదైంది.
 
అయితే పలుచోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. సరంపేటలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఎంత సముదాయించినా వినకపోగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. 
 
వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై దాడికి యత్నించారు. ఈ పెనుగులాటలో ఓ పోలీస్ అధికారి కాలువలో పడిపోయారు. ఫూటుగా  మద్యం సేవించి  పోలింగ్ బూత్ ల దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
 
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో పోలింగ్ బూత్ ల దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు ఓవరాక్షన్ చేయడంపై స్థానిక ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపిక నశించిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. క్యూ లైన్ లో ఉన్న ఓటర్లను ప్రశాంతంగా ఓట్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 
అటు శివన్న గూడెంలో  పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రంలోకి చొరబడేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ పై కూడా రాళ్ల దాడికి యత్నించారు. బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు తాగి వచ్చారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. నాన్ లోకల్ లీడర్స్ ను పోలీసులకు పట్టించినా..వదిలేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఘటనాస్థలానికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుకుని ఆరా తీశారు
మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో బీజేపీ నేతలు మద్యం పట్టుకున్నారు. ఈ గ్రామానికి టీఆర్ఎస్ ఇంచార్జ్గా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు మద్యం, పైసలు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా  రాజగోపాల్ రెడ్డి అఖండ విజయం సాధించబోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి విజయంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖేల్ ఖతం అని స్పష్టం చేశారు.
 
నెల రోజులు విచ్చలవిడిగా  డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఓటర్లకు డబ్బు పంచడానికి టార్గెట్ పెట్టారని చెప్పారు. భవిష్యత్ లో తమకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయో రావో అనే భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సొంతంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అంబులెన్స్, పోలీస్ వాహనాల్లోనే టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేశారని, వారికి పోలీసులు సహకరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. డబ్బు పంచిన వారిలో మొత్తం 42 మందే దొరికారని ఎన్నికల అధికారులు చెబుతున్నారని తెలిపారు.
 
అసలు ఎన్నికల సంఘం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని పేర్కొంటూ ఎన్నికల అధికారులు కేసీఆర్ జేబు మనుషులుగా మారిపోయారని విమర్శించారు. ఎన్నికల అధికారుల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.