దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్  విభాగానికి సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘ఓ పరి’ అనే ఆల్బమ్ లో ‘హరే రామ..హరే కృష్ణ’ మంత్రాన్ని ఐటెం సాంగ్ గా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తులు ధరించి నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని, లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించారు.  టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ గా పేరొందిన దేవీ శ్రీ ఇటీవలే నాన్ ఫిల్మ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. 

ఈ మ్యూజిక్ వీడియోను బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ లాంఛ్ చేశారు. ‘ఓ ప‌రి’ టైటిల్‌ తో సాంగ్ సాగనుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వయంగా కంపోజ్ చేయడమే కాకుండా ఆయనే పాడారు. అయితే పాట మధ్యలో హరే రామ..హరే కృష్ణ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

`హరేరామ హరేకృష్ణ’ అంటూ కోట్లాదిమంది హిందువులు ప్రపంచం అంతా ఆరాధనతో ప్రార్ధనలు చేసుకొంటూనే కొంతమందికి హిందువులను కించపరిచే విధంగా ఇటువంటి కీర్తనలను ఉపయోగించడం పరిపాటిగా మారినదని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. 

బికినీలతో యువతులు శ్రీ రాముని భజన చేస్తూ భజన చేయించడం ఏమాత్రం భావ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడైన దేవి శ్రీ ప్రసాద్ కు హిందూమతం పట్ల విశ్వాసం లేని పక్షంలో ఆ విధమైన చిత్రీకరణలను అర్ధం చేసుకోవచ్చని, కానీ ఓ హిందువుగా ఆ విధంగా చేయడం సహింపలేమని ఆమె చెప్పారు. తాను కూడా సినీనటిగా చాలాకాలంగా ఈ రంగంలో ఉన్నప్పటికీ ఏనాడూ హిందూ దేవతలను కించపరిచే విధంగా నటింపలేదని ఆమె చెప్పారు.