ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతుండడంపై గడ్కరీ ఆందోళన 

ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతుండడంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. క్లీన్‌ ఫ్యూయల్స్‌-2022పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన. గాలి కాలుష్యం భారత్‌కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు తగులబెడుతున్న తరుణంలో దేశ రాజధానిలో భారీగా కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం కోసం కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది ఓ పెద్ద సమస్య అని చెప్పారు.

వరి పొట్టును బయో విటమిన్‌గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశంలో అనేక విజయవంతమైన ప్రాజెక్టులున్నాయని, వరిగడ్డితో బయో-సీఎన్‌జీ, బయో ఎల్‌ఎన్‌జీని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా రంగాన్ని డీ కార్బనైజ్‌ చేసి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాన్ని నిలకడగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్‌జీ, బయో ఎల్‌ఎన్‌జీ, బయో డీజిల్, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ వంటి స్వచ్ఛమైన.. గ్రీన్‌ జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన ఇంధనం బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుందన్న ఆయన.. చమురు దిగుమతి బిల్లులను తగ్గిస్తుంది, ఇంధన భద్రత, వాయు కాలుష్యం తగ్గుదలను నిర్ధారిస్తుందని చెప్పారు.

ఢిల్లీలో దట్టంగా పేరుకుపోయిన పొగమంచు 

ఇలా ఉండగా, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్‌ను దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరగా, ఏక్యూఐ 408గా నమోదైంది. 

ప్రస్తుతం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్‌లో 318గా నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది.

మోడల్ టౌన్‌లోని ధీర్‌పూర్ 457గా రికార్డు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యవంతమైన వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోని మూడో నంబర్‌ టెర్మినల్‌ ప్రాంతంలో 346 నమోదైంది. 

కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులను, కూల్చివేతలను అధికారులు నిలిపివేయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. మరో వైపు గాలి నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.