ప్ర‌పంచం సంక్షోభంలో మునిగినా ఉజ్వల ప్రకాశంతో భారత్‌

ప్ర‌పంచం సంక్షోభంలో మునిగినా భారత్‌ ఉజ్వల ప్రకాశంతో కొనసాగుతుందని నిపుణులు, విశ్లేష‌కులు, ఆర్థిక వేత్త‌లు అభివర్ణించినట్లు ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ  గుర్తుచేశారు.  ‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ఇతివృత్తంగా బెంగుళూరులో  నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌  ద్వారా ప్రసంగించారు

భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా మన మూలాలను సుస్థిరం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్నాం అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని చెబుతూ విధానాలు-అమలు సంబంధిత సమస్యలతో దేశం 9-10 ఏళ్ల కిందట సతమతం అవుతున్నపుడు మార్పు దిశగా విధానాలు మలుపు తిరగడం గురించి ఆయన వివరించారు. 

ఆ మేరకు “పెట్టుబడిదారులను జాప్యంలో ముంచడానికి బదులు పెట్టుబడులకు ఎర్ర తివాచీ వాతావరణం సృష్టించాం. అలాగే కొత్త సంక్లిష్ట చట్టాల రూపకల్పనకు బదులు మేం వాటిని హేతుబద్ధం చేశాం” అని ఆయన విశదీకరించారు. సాహసోపేత సంస్కరణలు, భారీ మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ప్రతిభతోనే నవ భారతదేశం నిర్మించడం సాధ్యం అని భరోసా వ్యక్తం చేశారు.నేడు ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ సాహసోపేత సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు.

 ఈ సందర్భంగా జీఎస్టీ, ఐబీసీ, బ్యాంకింగ్ సంస్కరణలు, యూపీఐ, 1500 కాలం చెల్లిన చట్టాల రద్దు, 40 వేల అనవసర నిబంధనల తొలగింపు తదితరాలను ప్రధాని ఉదాహరించారు. కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలను నేరరహితం చేయడంతోపాటు పరోక్ష మూల్యాంకనం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కొత్త అవకాశాల కల్పన, డ్రోన్ నిబంధనల సరళీకరణతో పాటు భూగోళ-ప్రాదేశిక, అంతరిక్ష, రక్షణ వంటి రంగాల్లో చేపట్టిన చర్యలు అనూహ్య శక్తినిస్తున్నాయని మోదీ  గుర్తుచేశారు.

 గ‌త 8 సంవ‌త్స‌రాల్లో కార్యకలాపాలు సాగే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని, 20కి పైగా న‌గ‌రాలకు మెట్రో రైలు సేవలు విస్త‌రించాయని ప్ర‌ధానమంత్రి తెలిపారు. పీఎం-గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళిక లక్ష్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇది సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నదని తెలిపారు. 

దీని అమలులో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా ప్రస్తుత సదుపాయాల సద్వినియోగానికి పకడ్బందీ ప్రణాళిక రచించడమేగాక దాన్ని అమలు చేసే సమర్థ మార్గం గురించి కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. చిట్టచివరిదాకా అనుసంధానం, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ఉత్పత్తి లేదా సేవలను మెరుగుపరచే మార్గాల గురించి  మోదీ వివరించారు. 

ఈ ప్రయాణంలో యువత సాధించిన ప్రగతిని ఎత్తిచూపుతూ దేశంలోని ప్రతి రంగం యువశక్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, మానవ మూలధనంపై నిశితంగా దృష్టి సారించినపుడే ప్రగతి లక్ష్యాలను సాధించగలం. ఈ ఆలోచన ధోరణితో ముందడుగు వేస్తూ ఆరోగ్య, విద్యారంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించామని ప్రధాని తెలిపారు. 

 వ్యాపారాన్ని నిర్వహించడం లో సౌలభ్యం సంబంధి అగ్రగామి రాష్ట్రాల లో కర్నాటక తన స్థానాన్ని నిలబెట్టుకొంటూనే ఉంటోందని ఆయన చెప్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) పరంగా అగ్రగామి రాష్ట్రాల పట్టిక లో కర్నాటక చేరడానికి ఇది తోడ్పడిందని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల లో 400 కంపెనీ లు ఇక్కడే ఉన్నాయి. భారతదేశం లో వందకు పైబడ్డ యూనికార్న్ లలో నలభై కి పైగా యూనికార్న్ లు కర్నాటక లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.