ప్రముఖ గాంధేయవాది ఇలాబెన్‌ భట్‌ కన్నుమూత

ప్రముఖ మహిళా సాధికారికత కార్యకర్త, గాంధేయవాది, సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకురాలు ఇలాబెన్‌ భట్‌ (89) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం గుజరాత్‌ అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె సబర్మతి ఆశ్రమ సంరక్షణ, స్మారక ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సైతం సేవలందించారు.

1933లో జన్మించిన ఆమె సూరత్‌లోని సర్వజనిక్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంటీబీ ఆర్ట్స్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1955లో టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్  అని పిలువబడే టెక్స్‌టైల్ కార్మికుల పూర్వ యూనియన్‌లో న్యాయ విభాగంలో చేరారు. 1920లో కార్మిక సంస్థ ఏర్పాటైంది.

గాంధీజీ ప్రేరణతో, భట్ సేవాను స్థాపించారు. మహిళలకు రుణాలు అందించడానికి 1974లో సహకార బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. భట్ 1984-1988 వరకు చైర్‌పర్సన్‌గా ఉన్న మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రపంచ నెట్‌వర్క్ అయిన ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ ని సైతం స్థాపించారు.

రాజ్యసభ సభ్యురాలిగా 1989 వరకు పనిచేశారు. ఆమె ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు సలహాదారుగా కూడా ఉన్నారు. 2007లో ఆమె మానవ హక్కులు, శాంతిని పెంపొందించడానికి నెల్సన్ మండేలా స్థాపించిన ఎల్డర్స్ అనే గ్రూప్‌లో చేరారు. ఇటీవల ఆమె మహాత్మా గాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ అనే యూనివర్సిటీకి ఛాన్సెలర్‌ పదవికి రాజీనామా చేశారు.

ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అలాగే రామన్‌ మెగసెసే అవార్డు, గాంధీ శాంతి బహుమతిని అందుకున్నారు. ఆమెకు కుమారుడు మిహిర్‌, కుమార్తె అమిమయి ఉన్నారు.

ప్రధాని మోదీ సంతాపం 

ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇలాబెన్ భట్ట్ మృతి పట్ల ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహిళల సాధికారికతకు,  సామాజిక సేవను, యువతీయువకుల లో విద్య వ్యాప్తిని ప్రోత్సహించడం కోసం ఆమె చేసినటువంటి కృషిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా స్మరించుకొన్నారు.