పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.  బెంగళూరులోని విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా దక్షిణాది సూపర్ స్టార్
 రజనీకాంత్, టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ హాజరయ్యారు.  
67వ కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా పునీత్ సతీమణి అశ్విని పునీత్ కు ఈ అవార్డును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రదానం చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం వారు లెక్కచేయకుండా  కూర్చున్నారు.   పునీత్ రాజ్‌కుమార్‌కు అవార్డు రావడం ఆనందంగా ఉందని అశ్విని పునీత్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈసందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ పిన్న వయస్సులోనే గొప్ప సాధన చేసిన పునీత్‌కు కర్ణాటక రత్న పురస్కారానికి పూర్తి అర్హులు అని చెప్పారు. పునీత్ రాజ్‌కుమార్ 4 ఏళ్ల వయసులో శబరిమలై వచ్చారని, తొలిసారి తనని అక్కడ చూశా, శబరిమలై యాత్రకు 48 కిమీ కాలినడకన  రాజ్‌కుమార్ తన భుజాలపై పునీత్‌ను తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ఓ నటుడు 60 ఏళ్లలో సాధించే కీర్తిని పునీత 21 ఏళ్లలో సాధించారని కొనియాడారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, తెలుగులో ఎన్టీఆర్, కర్ణాటకలో డా. రాజ్‌కుమార్‌ల సాధనకు సాటివచ్చే వ్యక్తి అని కొనియాడారు. పునీత్ మరణించిన సమయంలో తాను ఐసీయూలో ఉన్నానని, మూడు రోజుల తరువాత ఆయన మరణవార్త విని షాక్ అయ్యానని చెప్పారు.

“ఒక వ్యక్తి తన పెద్దల నుండి కుటుంబ వారసత్వం, ఇంటిపేరును పొందుతాడు. కానీ వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. అహం, అహంకారం లేకుండా తన వ్యక్తిత్వం, చిరునవ్వుతో రాష్ట్రం మొత్తాన్ని గెలుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా..? అది పునీత్ రాజ్‌కుమార్ మాత్రమే” అంటూ
ఎన్టీఆర్ కొనియాడారు. 
 
కర్ణాటక రత్న అవార్డు ఇప్పటివరకు తొమ్మిది మందికి మాత్రమే లభించింది. చివరిసారిగా 2009లో డాక్టర్ వీరేంద్ర హెగ్గడే సామాజిక సేవకు గానూ కర్ణాటక రత్న అవార్డును అందుకున్నారు. 
ముందుగా  పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వినోద పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గానూ 1992లో ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.