ఉక్కుమనిషి సర్దార్ పటేల్ కు రాష్ట్రపతి ముర్ము నివాళి

ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి  జగదీప్ ధంఖర్, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్  వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో చేపట్టిన సమైక్యతా పరుగు కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి పతాకం ఊపి ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఐక్యతా పరుగు కార్యక్రమానికి హాజరైన వారితో కేంద్ర హోం మంత్రి, జాతీయ సమైక్యతా ప్రమాణం కూడా చేయించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ  75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నందున నేపథ్యంలో ఈ నాటి కార్యక్రమానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పారు.
 స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతదేశానికి పునాదులు వేసి, భారత్ దార్శనికతను సాకారం చేయడంలో తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత అనే ముఖ్యమైన సందేశంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.  సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరు చెప్పగానే నేటి సమైక్య భారతదేశం రేఖా చిత్రపటం గుర్తుకు వస్తుందని  అంటూ సర్దార్ సాహెబ్ లేకుంటే నేటి విశాలమైన, దృఢమైన, శక్తివంతమైన భారతదేశం సాధ్యమయ్యేది కాదని అమిత్ షా స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా గుజరాత్ లోని సర్దార్ పటేల్ ఐక్యతా ప్రతిమవద్ద ఆయనకు నివాళి అర్పించి, సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది మన స్వాతంత్ర్యానికి 75 వసంతాలు పూర్తయిన సంవత్సరం మాత్రమేగాక మనం సరికొత్త సంకల్పాలతో వాటిని నెరవేర్చే దిశగా పయనిస్తున్నాం అని స్పష్టం చేశారు.
కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా ప్రతి దశలోనూ సమైక్యత ఎంతో అవసరమని ప్రధాని చెబుతూ ఈ భావన దేశవ్యాప్తంగా 75,000 చోట్ల సమైక్యతా పరుగు రూపంలో అంతటా ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు. ‘‘సర్దార్ పటేల్ దృఢ దీక్షనుంచి యావద్దేశం స్ఫూర్తి పొందుతోంది. దేశ సమైక్యత కోసం, ‘పంచప్రాణ్’ సూత్రాన్ని ఆచరణలో చూపడానికి ప్రతి పౌరుడు ప్రతినబూనారు’’ అని ఆయన తెలిపారు.
‘‘మన స్వాతంత్ర్య పోరాటానికి సర్దార్ పటేల్ వంటి మహనీయులు నాయకత్వం వహించి ఉండకపోతే పరిస్థితిని ఊహించడం కూడా కష్టమే. దేశవ్యాప్తంగా 550కి పైగా రాజ సంస్థానాలను ఆయన విలీనం చేయకపోయి ఉంటే- ఏం జరిగేది?’’ అని గుర్తు చేశారు. అలాగే భరతమాత పట్ల మన రాజ సంస్థానాలు లోతైన త్యాగభావన, విశ్వాసం ప్రదర్శించి ఉండకపోతే ఏం జరిగి ఉండేది? అని ప్రధాని ప్రశ్నించారు.
ఈ దుస్సాధ్యమైన పనిని సర్దార్ పటేల్ పూర్తిచేశారని చెబుతూ సర్దార్ పటేల్ జయంతి, సమైక్యతా దినోత్సవం మనకు కేవలం క్యాలెండర్‌లోని తేదీలు కావని, . భారతదేశ సాంస్కృతిక శక్తికి గొప్ప ప్రతీకలుగా నిలిచే వేడుకలు అని ప్రధాని స్పష్టం చేశారు. భారత ఐక్యత ఎన్నడూ బలవంతంగా రుద్దబడినది కాదు.. ఇది సదా మన దేశ సహజ స్వభావం. ఐక్యతే మా ప్రత్యేకత అని తెలిపారు.