ఓటమి తప్పదనే‘‘ఎమ్మెల్యేల కొనుగోలు’’ డ్రామాకు తెరలేపిన కేసీఆర్

ఓటమి తప్పదనే‘‘ఎమ్మెల్యేల కొనుగోలు’’ డ్రామాకు తెరలేపిన కేసీఆర్
మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదనుకున్న తరుణంలో ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు’’ డ్రామాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెరలేపారని బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. స్వయంగా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాసిన కేసీఆర్ ఈ డ్రామా పూర్తిగా తేలిపోయిందని, పైగా ఈ డ్రామాలో లోపాలు కొట్టొచ్చినట్టు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తొలుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరినీ మోహరించి, డబ్బు మూటలతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. రాజకీయ స్పృహ, చైతన్యం ఉన్న మునుగోడు ఓటర్లు డబ్బుకు, ప్రలోభాలకు లొంగకపోవటంతో తన పాచిక పారలేదని ఆయన గ్రహించారని చెప్పారు.
కేవలం ఉప ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ మునుగోడులో అధికారిక యంత్రాంగాన్ని, రాజకీయ పదవులను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అటువంటి కేసీఆర్ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.
ఫాంహౌజ్ ఎమ్మెల్యేలను ప్రజల నుంచి దూరంగా ఉంచి, నాటకీయంగా సీఎం హెలికాప్టర్‌లో తరలించి, మునుగోడు ప్రజల ముందు ప్రదర్శించారు. సమావేశం ముగిసిన వెంటనే మళ్లీ వారిని హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తిరిగేందుకు, మీడియా ముందుకు రావడానికి ఎందుకు అనుమతించడం లేదు? ఆయన ఏదో విషయం కచ్చితంగా దాస్తున్నారని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. రాజకీయంగా చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మరని గ్రహించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్ వీడియో, ఆడియో కంటెంట్‌ను రూపొందించారని తెలిపారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ ఆయన బిజెపిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు ఫిరాయించారని,వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా దక్కాయ ని తెలిపారు.
ఇటువంటి నీచ చరిత్ర ఉన్న వ్యక్తి బిజెపి వైపు వేలెత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నాడని అంటూ సూర్యుడిపై ఉమ్మేస్తే అది తన ముఖంపైనే పడుతుందని కేసీఆర్ గ్రహించాలని హితవు చెప్పారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని స్పష్టం చేశారు. మునుగోడులో బిజెపికి లభిస్తున్న ఆదరణ, మద్దతు చూసి ఆయన ఆందోళన చెందుతున్నారని అంటూ చుండూరు ప్రసంగం ఆయనలోని నిరాశను ప్రతిబింబించిందని తెలిపారు.
అవినీతి, దొరల పాలన నుండి తెలంగాణను కాపాడేందుకు విజ్ఞత గల మునుగోడు ఓటర్లు కేసీఆర్‌ నాటకాలను గ్రహించి, టీఆర్‌ఎస్‌ను ఓడించి, బిజెపి అభ్యర్థి కె.రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని తరుణ్ ఛుగ్ విజ్ఞప్తి చేశారు.
అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నిక 
కాగా, మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలు తప్ప అందులో ఏమీ లేవని ఆరోపించారు. ప్రధాని మోదీ  మీద అరిగిపోయిన టేపు రికార్డులా కేసీఆర్ మాట్లాడారని ధ్వజమెత్తారు. 
 
ఎనిమిదేళ్ళుగా రాష్ట్రానికి ఏమీ చేయనిది ఏదో చేస్తానని చెప్తున్నారన్న ఆయన కొత్తగా ఏదో చేస్తానన్నారంటే ఈ ఎనిమిదేళ్లలో ఏమీ చేయలేదనే అర్థమని ఎద్దేవా చేశారు. మునుగోడులో ఎనిమిదేళ్లలో అదనంగా ఒక్క గుంట భూమికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదని లక్ష్మణ్ ఆరోపించారు. 
 
దేశం మొత్తంలో 50 మందికి ఒకటి చొప్పున బెల్ట్ షాపు పెట్టించేందుకు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధి కావాలన్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.