బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మొబైల్‌ హ్యాక్ చేసిన రష్యా

బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌ను రష్యా గూఢచారులు హ్యాక్‌ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కోసం పని చేస్తున్న గూఢచారులు ఈ పని చేసినట్లు డైలీ మెయిల్‌ కథనం పేర్కొంది. అయితే లిజ్‌ ట్రస్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె వ్యక్తిగత ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు తెలిపింది. 

ఫోన్ హ్యాక్ అయినప్పుడు లిజ్‌ట్రస్‌ బ్రిటన్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.  మిత్రదేశాలతో ట్రస్ జరిపిన చర్చలకు సంబంధించిన కీలక సమాచారాలు రష్యా చేతిలో పడి ఉండొచ్చని తెలిపింది. ఒక ఏడాది కాలానికి సంబంధించిన ట్రస్ సంభాషణలు, సందేశాలు పుతిన్ ఏజెంట్ల చేతికి చిక్కినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సన్నిహిత రాజకీయ వేత్త, ఆ తర్వాత బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన క్వాసి క్వార్టెంగ్, లిజ్‌ మధ్య సుమారు ఏడాది పాటు జరిగిన వ్యక్తిగత మెసేజ్‌లను రష్యా రహస్య గూఢచారులు పొందినట్లు పేర్కొంది.  ఉక్రెయిన్‌ యుద్ధం గురించి అంతర్జాతీయ విదేశాంగ మంత్రులతో ఆమె జరిపిన అత్యంత సున్నితమైన చర్చలు, ఉక్రెయిన్‌కు ఆయుధాల రవాణా గురించిన అంశాలు కూడా హ్యాక్‌ చేసిన సమాచారంలో ఉన్నట్లు వెల్లడించింది.

అలాగే బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను విమర్శిస్తూ లిజ్‌, క్వాసి క్వార్టెంగ్ మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రష్యా గూఢచారులు హ్యాక్‌ చేసినట్లు డైలీ మెయిల్‌ తెలిపింది. ఈ సమాచారంతో ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేసింది. 

ప్రధాని పదవికి లిజ్ ట్రస్ పోటీ చేస్తున్న సమయంలో ఈ హ్యాకింగ్ వ్యవహారాన్ని గుర్తించారు. అయితే ఆ సమయంలో క్యాబినెట్ సెక్రటరీగా ఉన్న సైమన్ కేస్, బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ హ్యాక్ సమాచారాన్ని తొక్కిపెట్టినట్లు ఆ రిపోర్ట్‌ పేర్కొంది. 

హ్యాక్‌ అయిన లిజ్‌ ట్రస్‌ వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌ ప్రస్తుతం ప్రభ్వుత్వ ఆధ్వర్యంలోని సురక్షిత కేంద్రంలో ఉన్నట్లు వివరించింది. అయితే లిజ్ ట్రస్ వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై స్పందించబోమని బ్రిటన్ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర సైబర్ ముప్పులను ఎదుర్కొనే బలమై భద్రతా వ్యవస్థ ఉందని తెలిపారు.